World Public Services

Telugu News for change makers

20081222

వారసులకు పరిహారం చెల్లించాలి : సుప్రీం

పాలసీదారుని మృతిని తెలుపక పోయినా మోటారు వాహన బీమా సంస్థ మృతుని వారసులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకు రుణంతో ఒక ట్రక్‌ను ఆత్మారామ్‌ కొనుగోలు చేశాడు. ఈ వాహనానికి యునైటెడ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ బీమా పాలసీని తీసుకున్నాడు. 1991లో ఆత్మారామ్‌ మరణం తరువాత ఈ వాహనాన్ని నడుపుతున్న అతని వారసులు రిజిస్ట్రేషన్‌ మార్పిడి చర్యలు తీసుకోలేదు. బీమా మొత్తాన్ని ఆత్మారామ్‌ పేరిటే ఏటా బ్యాంకు ద్వారా చెల్లించారు. 1994 సెప్టెంబర్‌ 15న ఈ వాహనానికి ప్రమాదం సంభవించడంతో డ్రైవర్‌ చత్తార్‌సింగ్‌ మరణించాడు. మృతుని కుటుంబానికి రూ.1.42 లక్షలు చెల్లించాలని కార్మిక పరిహార కమిషనర్‌ బీమా కంపెనీని ఆదేశించారు. పాలసీదారుడు మరణించిన కారణంగా పరిహారాన్ని చెల్లించలేమని బీమా సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు.. పాలసీ రెన్యూవల్‌ సమయంలో తనిఖీ చేయాల్సిన బాధ్యత కంపెనీదే అయినందున, పరిహారం చెల్లింపును తిరస్కరించలేరని స్పష్టం చేసింది. దీంతో బీమాసంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణాన్ని తెలియచేయలేదని పరిహారం చెల్లింపునకు నిరాకరిస్తున్న సంస్థ, ప్రీమియంను స్వీకరించడకుండా ఉండాల్సిందని జస్టిస్‌ ఎస్‌బీ సిన్హా, సిరియాక్‌ జోసెఫ్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Labels:

రూ.527 కోసం పదేళ్ల న్యాయపోరాటం

పదేళ్ల న్యాయపోరాటం చేసిన ఓ వృద్ధుడు చివరకు విజయం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం తపాలా కార్యాలయం నుంచి బి.ఆర్‌.శర్మ (75) 1996లో రూ.3వేలు రుణం తీసుకున్నాడు. గడువుకు ముందే రుణాన్ని చెల్లించేశాడు. అయినా కార్యాలయం రూ.527 ఎక్కువగా వసూలు చేసింది. దీనిపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి రూ.వెయ్యి ఖర్చు చేశారు. పదేళ్ల పోరాటంతర్వాత వినియోగదారుల ఫోరం శర్మకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అతనికి రూ.527తో పాటు న్యాయ పోరాటానికైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. శర్మ న్యాయవాది సునీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ 'ఈ పోరాటం కేవలం రూ.527 కోసం కాదని వ్యవస్థలోని లోపాలపైనేనని' పేర్కొన్నారు.

Labels:

20071126

విమానం రద్దుకు పరిహారం చెల్లించాలి

నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా రైళ్ళు, బస్సులు, విమానాలు బయ లుదేరడం, ముందస్తు సమాచారం లేకుండానే హఠాత్తుగా రద్దవడం, ఇవన్నీ తరచుగా ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలే. ఎప్పుడు బయలు దేరుతుందో తెలియక, అసలు సర్వీసు ఉందో, రద్ద యిందో సమాచారంలేక గంటల తరబడి ఎదురుచూస్తూ ప్రయాణికులకు  కలిగే చికాకు, ఆందోళన, ఆవేదన అంతా ఇంతా కాదు. ఇలా బాధ్యతా రా హిత్యంగా ప్రవర్తిస్తున్న రవాణా సంస్థలపై వినియోగదారుల కోర్టులలో ఎన్నోసార్లు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు కూడా ఇటువంటిదే. సాంకేతిక కారణాల రీత్యా విమానాలను రద్దుచేసిన విమానయాన సంస్థలు ప్రయాణికులందరికీ 15,000 రూపాలయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. యోగేష్ కుమార్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్ ఈ ఆదేశాలు జారీచేసింది.

Labels:

20071104

ఇతర చట్టాల ఉల్లంఘనతో సంబంధం లేదు

బీమా పాలసీకి సంబంధించిన నియమనిబంధనలను పాలసీదారుడు ఉల్లంఘించనంతవరకూ, అతని క్లెయిములను చెల్లించాల్సిందేనని జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పుచెప్పింది. పాలసీదారుడు వేరే చట్టాలనుకాని, నిబంధనలను కాని ఉల్లంఘించినప్పటికీ, బీమా అనేది రెండు పార్టీల మధ్య వ్యవహారమైనందువల్ల అతనికి క్లెయిముల చెల్లింపు నిలిపివేసే అధికారం బీమా కంపెనీలకు లేదని జస్టిస్ ఎంబీ షా, కమిషన్ సభ్యులు రాజ్యలక్ష్మీరావు, కేఎస్ గుప్తా స్పష్టం చేశారు.

Labels: , ,

రిలయన్స్ నష్టపరిహారం ఇవ్వాల్సిందే!

విద్యుత్ సరఫరా చేయని కారణంగా పంట దెబ్బతిన్న ఓ రైతుకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. రిలయన్స్ సంస్థ అధీనంలోని బీఎస్ఈఎస్ కంపెనీని ఆదేశించింది. విద్యుత్ సరఫరాకు అవసరమైన స్కిరల్ కండక్టర్ అనే విద్యుత్ తీగ అపహరణకు గురైనట్టుగా సంబంధిత రైతు ఫిర్యాదు చేసినందున, కొత్తగా ఆ కండక్టర్‌ను తెచ్చి వేసి విద్యుత్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత బీఎస్ఈఎస్‌పై ఉందని కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ జేడీ కపూర్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందర్‌సింగ్ గహలౌట్ 8 నెలలుగా విద్యుత్ సరఫరా లేక చాలా ఇబ్బందులు పడ్డాడని, తనకు సరఫరా జరగడం లేదని ఫిర్యాదు చేసినా కంపెనీ పట్టించుకోలేదని, అందువల్ల కంపెనీ తన సేవల్లో లోపం జరిపిందని కమిషన్ తీర్మానించింది.

Labels: , ,

20071101

'వైద్య పరీక్ష' ఆర్‌టీఐ పరిధిలోకి రాదు: సీఐసీ

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నిరాకరించింది. వైద్యుడు, రోగికి మధ్యనున్న సంబంధం విశ్వాసంతో కూడుకొని ఉన్నదని, అందువల్ల వైద్య పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఝాన్సీ నివాసి అర్జేష్ కుమార్ మాధోక్ తన కుమారుడు ఆదిత్యకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలను ఆర్‌టీఐ చట్టం కింద బహిర్గతం చేయాలని సీఐసీని కోరారు. ఆ వైద్య పరీక్షలు మాధోక్ భార్య కోరితేనే నిర్వహించామని, ఇప్పుడు ఆ నివేదిక వివరాలను ఇతరులకు వెల్లడించమని సీడీఎఫ్‌డీ పేర్కొంది. సీడీఎఫ్‌డీ నిర్ణయాన్నిసీఐసీ సమర్థించింది. వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను కోరడం ఆమె ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడమేనని సీఐసీ వ్యాఖ్యానించింది.

Labels: , ,

20071029

ప్లాట్లను విక్రయించొద్దు

నెలసరి వాయిదాల చొప్పున డబ్బు వసూలు చేసి అనంతరం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుంటున్నారని బాధితులు ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఫోరం కేసును విచారణకు స్వీకరించి తుది తీర్పు వెలువడే వరకు ఆ ప్లాట్ల క్రయ, విక్రయాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 'శ్రీ సాయిమిత్ర హౌసింగ్ కార్పొరేషన్' రియల్ ఎస్టేట్ సంస్థ హయత్‌నగర్ మండలంలోని సుర్మాయిగూడ గ్రామంలో వెంచర్ వేసి, వాయిదాల పద్ధతిన డబ్బు చెల్లిస్తే కాలపరిమితి ముగియగానే రిజిస్ట్రేషన్ చేయించి ప్లాట్లను అప్పగిస్తామని ప్రచారం చేసింది. దీంతో ఎల్లారెడ్డిగూడకి చెందిన డి. బ్రహ్మనాయుడు 2005 నవంబర్ 5న ఆ వెంచర్‌లోని 167, 168 ప్లాట్లకై తన తల్లి పేరిట రూ. 1,18,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నారు. 2007 జనవరి 9న మరో రూ. 1,52,000లు కాలపరిమితి కంటే ముందే పూర్తి మొత్తాన్ని చెల్లించారు. వాటితోపాటు అభివృద్ధి ఖర్చులకు గాను రూ.20,000లు, రిజిస్ట్రేషన్ ఖర్చులకు 15,000లు కూడా సంస్థకు ముట్టజెప్పారు. అనంతరం సంస్థ ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించింది. దీంతో ఒప్పందం ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటూ న్యాయవాది ద్వారా ఓ లీగల్ నోటీస్ పంపినప్పటికీ, సంస్థ నుంచి కాని దాని నిర్వాహకుడు కోటేశ్వర్‌రావు నుంచి కాని స్పందన రాకపోవడంతో బాధితులు రంగారెడ్డి జిల్లా ఫోరంను ఆశ్రయించారు. ఫోరం ఆ రెండు ప్లాట్లపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Labels: , ,

20071028

చలిగాలులతో మరణానికీ బీమా

చలిగాలులతో కలిగే మరణం ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కిందకే వస్తుందని జాతీయ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. అలాంటి మరణాలకు బీమాసంస్థలు బీమా సొమ్మును నిరాకరించడం కుదరదని తేల్చిచెప్పింది. చలిగాలులు ఊహించని పరిణామాలని, ప్రణాళికతో సిద్ధంచేసి ఉంచేవి కాదని పేర్కొంది. బీహార్‌కు చెందిన రతీదేవి అనే మహిళ భర్త చలిగాలులతో మరణించడంతో ఆమె 'జాతీయ బీమా కంపెనీ లిమిటెడ్ సంస్థ' నుంచి తన భర్తకు రావాల్సిన బీమా సొమ్ముకోసం దరఖాస్తు చేశారు. చలి గాలులు ప్రమాదం కిందకు రావని బీమా సంస్థ తిరస్కరించింది. జాతీయ కమిషన్ రతీదేవి వాదనను సమర్థించి, ఆమెకు రూ.3.10 లక్షల బీమా సొమ్ము ఇవ్వాలని ఆదేశించింది.

Labels: , ,