World Public Services

Telugu News for change makers

20071128

త్వరలో జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ

పొగాకు నిరోధక చట్టాన్ని అమలుచేసేందుకు 'జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ'ను ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్‌ లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల పరిసరాల్లో పొగతాగడంపై నిషేధం, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చూడటం వంటి అంశాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయన్నారు. బీడీ, సిగరెట్‌ పెట్టెలపై చట్టబద్ధమైన హెచ్చరికల ముద్రణ, వాటిల్లో తార్‌, నికోటిన్‌ ఏస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారో లేదో కూడా పరిశీలిస్తుందన్నారు.

Labels: ,

20071126

2008 డిసెంబర్ నాటికి 22 జిల్లాల్లో ' ఆరోగ్యశ్రీ'

2008 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 22 జిల్లాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఖమ్మం జిల్లా వైరాలో విలేకరుల సమావేశంలో  వెల్లడించారు.  పేదలకు నాణ్యమైన కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆసియాలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు.

Labels: ,

20071124

ఎయిడ్స్ నిరోధక వ్యాక్సిన్ ప్రయోగం విఫలం

దేశీయంగా తయారుచేస్తున్న ఎయిడ్స్ నిరోధక వ్యాక్సిన్(టీకా) తొలి దశ ప్రయోగాలు విఫలమయ్యాయి. దేశంలోనే ప్రప్రథమంగా రెండేళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించిన పుణేలోని నేషనల్ ఎయిడ్స్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎఆర్ఐ) శాస్త్రవేత్తలు రూపొందించిన ఎయిడ్స్ వ్యాక్సిన్‌ పరీక్షల్లో విఫలమైంది. మొదటిదశ పరీక్షల్లో భాగంగా 2005లో 30 మందిపై అడెనో అసోసియేటెడ్ వైరస్ వెక్టర్ వ్యాక్సిన్ ప్రయోగించి చూశారు. కానీ వారిలో 80 శాతం మందిలో వ్యాక్సిన్ ప్రభావం చూపించలేకపోయింది. వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో వెంటనే రోగనిరోధక శక్తి ఆశించినంతగా పెరగలేదు.. అందువల్ల ఈ వ్యాక్సిన్ రెండోదశ ప్రయోగాలకు వెళ్లదలుచుకోవడం లేదని ఎన్ఎఆర్ఐ డైరెక్టర్ రమేష్ పరంజపే తెలిపారు. వ్యాక్సిన్‌ను మూడుదశల్లో ప్రయోగించాలని శాస్త్రవేత్తలు మొదటగా భావించారు. మొదటిదశలో 30మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి, పనితీరును అధ్యయనం చేశారు. మొదటిదశ ఫలితాలు సంతృప్తికరంగా వస్తే , రెండోదశలో 500 మందిపై మూడోదశలో వేలాదిమందిపై పరీక్షించి చూడాలని భావించారు. ఇదీ విజయవంతం అయితే వేలాది మందిపై ప్రయోగించి టీకా ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ తొలి దశలోనే టీకా అంతగా ప్రభావం చూపలేదు.

Labels: , ,

20071121

భారతదేశంలో తగ్గుతున్న ఎయిడ్స్

భారతదేశంలో హెచ్ఐవీ/ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గింది.  దేశంలో ఎయిడ్స్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా లెక్కల్లో తేలింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎయిడ్స్ నియం త్రణ విధానం ఫలితాలనిస్తోందని, ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగ భారతదేశ సమన్వయ కర్త డెనిస్ బ్రౌన్ చెప్పారు. సమితి అంచనా ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 25లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. తమిళనాడు, మహారాష్ట్రలో ఎయిడ్స్ కేసులు తగ్గగా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెరిగాయి.  అంచనా వేసిన దానికన్నా ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ కేసు లు ఏడు మిలియన్లు తగ్గాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఎయిడ్స్ రోగుల సంఖ్య 39.5 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపారు.

Labels: , ,

20071106

చట్టపరిధిలోకి మొబైల్ ఫోన్ టవర్లు

మొబైల్ ఫోన్ టవర్లు హానికరమైన ఎలక్ట్రోమేగ్నటిక్ రేడియేషన్‌ను వెలువరిస్తుండటంతో వాటిని క్రమబద్ధీకరిస్తూ చట్టాన్ని రూపొందించమని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. సెల్యులార్ సర్వీసు ప్రొవైడర్లకు చెందిన 3,000 టవర్లు నగరంలో ఉన్నాయి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు టవర్ల స్థాపన జరుగుతూనే ఉంది. టవర్ల నుండి వెలువడే రేడియేషన్ స్థాయి డేటాపై ఖచ్చితమైన ప్రమాణాలు ఇప్పటి వరకు లేవు. దీనికి సంబంధించి ఎటువంటి చట్టం లేకపోవడంతో ప్రభుత్వం ఏ రకమైన చర్యా తీసుకోలేక పోతోంది.

Labels: , , ,

20071105

ఇఎంఆర్‌ఐ సర్వీసు లకు మరో 122 అంబులెన్స్‌లు

సత్యం ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఇఎంఆర్‌ఐ సర్వీసు లకు ఈ యేడాది అదనంగా మరో 122 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చనుందని, ఈ యేడాది ఇఎంఆర్‌ఐ, హెచ్‌ఆర్‌ఎంఐ సర్వీసులకోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద 32 కోట్లరూపాయలను కేటాయించనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి సంభాని చంద్రశేఖర్‌ చెప్పారు. ఇఎంఆర్‌ఐ,హెచ్‌ఎంఆర్‌ఐ సర్వీసుల నిర్వహణకోసం 95శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చడానకి అవగాహన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, సత్యం ఫౌండేషన్‌ ప్రతినిధుల తరుపున సచివాలయంలో సంతకాలు జరిగాయిం. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆరోగ్యసమాచార సర్వీసులకు సంబంధించి సత్యం ఫౌండే షన్‌ వద్ద ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 380 అంబులెన్సులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యంఫౌండేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్న మూడు జిల్లాల్లో ఆరోగ్య సమాచార సర్వీసులను అందిస్తున్నామని చెప్పారు. ఇఎంఆర్‌, హెచ్‌ఎంఆర్‌ఐ లోగోల స్థానంలో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ లోగోలను ఇక మీదట ఉపయోగించనున్నట్లు మంత్రి చెప్పారు.

Labels: , , ,

20071101

'వైద్య పరీక్ష' ఆర్‌టీఐ పరిధిలోకి రాదు: సీఐసీ

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నిరాకరించింది. వైద్యుడు, రోగికి మధ్యనున్న సంబంధం విశ్వాసంతో కూడుకొని ఉన్నదని, అందువల్ల వైద్య పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఝాన్సీ నివాసి అర్జేష్ కుమార్ మాధోక్ తన కుమారుడు ఆదిత్యకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలను ఆర్‌టీఐ చట్టం కింద బహిర్గతం చేయాలని సీఐసీని కోరారు. ఆ వైద్య పరీక్షలు మాధోక్ భార్య కోరితేనే నిర్వహించామని, ఇప్పుడు ఆ నివేదిక వివరాలను ఇతరులకు వెల్లడించమని సీడీఎఫ్‌డీ పేర్కొంది. సీడీఎఫ్‌డీ నిర్ణయాన్నిసీఐసీ సమర్థించింది. వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను కోరడం ఆమె ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడమేనని సీఐసీ వ్యాఖ్యానించింది.

Labels: , ,

20071026

ఫార్మా సంస్థలకు ఔషధ నియంత్రణశాఖ నోటీసులు

అనుమతులు లేకుండా రాష్ట్రంలో అమ్ముతున్న పలు మందును ఔషధ నియంత్రణశాఖ నిషేధించింది. రాష్ట్రంలో 33 రకాల (కాంబినేషన్ల) మందులు అనుమతులు లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామని, పది కంపెనీలు ( డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బయోలాజికల్‌ఈ, నాట్కోఫార్మా, అరబిందో ఫార్మా, కాంటెస్ట్‌ కెమికల్స్‌, సిటాడెల్‌, వ్యాన్‌గార్డ్‌, నోయల్‌ఫార్మా, టార్‌గాఫ్‌, యూనిసాన్‌క్యో కంపెనీలు) వీటిని తయారు చేస్తున్నాయని ఔషధ నియంత్రణ శాఖ డీజీ ఆర్‌.పి.మీనా చెప్పారు. ఇలాంటి మందులపై డ్రగ్స్‌, కాస్మొటిక్స్‌ చట్టం 122ఈ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మందుల్ని తయారుచేస్తున్న ఫార్మా కంపెనీలు 15 రోజుల్లోగా మార్కెట్లోని తమ ఉత్పత్తుల్ని వెనక్కు తీసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్వరం, జలుబు వంటి సాధారణ రుగ్మతల మొదలు వివిధ జబ్బుల్ని తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్‌ మొదలైనవి ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. తాము నిర్వహించిన దాడుల్లో హైదరాబాద్‌లోనే రూ.1.41 కోట్లు, విశాఖపట్నంలో రూ.53 లక్షలు, విజయవాడ పరిధిలో రూ.2 కోట్ల విలువైన మందుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మందులకు జాతీయ ఔషధ నియంత్రణ శాఖ అనుమతులు తీసుకోకుండా ఇతర రాష్ట్రల్లో నామమాత్రపు అనుమతులు తీసుకుని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు మీనా పేర్కొన్నారు. ఇలాంటి మందులు వినియోగించే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని, కాబట్టి మందుల వాడకంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

Labels: , ,

20071025

జనన మరణాల వార్షిక నివేదిక

జనన మరణాల వార్షిక నివేదిక-2006ను ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి డాక్టర్ ఎ.కె.వాలియా 24.10.2007 బుధవారం విడుదల చేశారు. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఢిల్లీలో జనన, మరణాల రేటు జాతీయ స్థాయి కంటే తక్కువగా ఉంది. ఏటా ప్రతి వెయ్యి మందికి జనన రేటు జాతీయ స్థాయిలో 23.8 ఉండగా, ఢిల్లీలో 19.95 మాత్రమే నమోదయింది. మరణాల రేటు జాతీయ స్థాయిలో ఏటా వెయ్యిమంది జనాభాకు 7.6 ఉండగా ఢిల్లీలో 6.11 ఉంది. దేశంలో ప్రతిరోజూ 71812 మంది జన్మిస్తుండగా, అందులో 884 మంది ఢిల్లీలో పురుడుపోసుకొంటున్నారు. రోజూ దేశంలో 22932 మంది మరణిస్తుండగా ఢిల్లీలో 271 మంది మరణిస్తున్నారు. ఢిల్లీలో 2005లో 3.24 లక్షల జననాలు నమోదుకాగా 2006లో 3.23 లక్షలు నమోదయ్యాయి. 2006లో నమోదయిన 3.23 లక్షల జననాల్లో అబ్బాయిలు 1.76 లక్షలు ఉండగా అమ్మాయిలు 1.47 లక్షలు మాత్రమే. అంతకు ముందు ఏడాది 1.78 లక్షల మంది అబ్బాయిలు, 1.46 లక్షల మంది అమ్మాయిలు ఢిల్లీలో జన్మించారు. 2005తో పోలిస్తే 2006లో అమ్మాయిల జననాల సంఖ్య పెరిగింది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 2005లో 822 మంది అమ్మాయిలు జన్మించగా 2006లో 831కు పెరిగింది. జననాల సంఖ్య కూడా తగ్గింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు 2005లో 20.61 జననాలు నమోదుకాగా.. 2006లో 19.95కు తగ్గింది. ప్రతిరోజూ నమోదవుతున్న జననాల సంఖ్య కూడా 889 నుంచి 884కు దిగివచ్చింది. మొత్తం 78 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. అంతకు ముందు ఏడాది 74 శాతం ప్రసవాలే ఆసుపత్రుల్లో జరిగేవి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 2006లో 6.11 మరణాలు నమోదు కాగా అంతకు ముందు ఏడాది 7.6గా నమోదయ్యాయి. 2006లో 98908 మంది మరణించగా... అందులో 37 శాతం మంది 60 ఏళ్లు, అంతకన్నా వయసు పైబడిన వాళ్లు ఉన్నారు. 22 శాతం మంది 31-50 వయసుల వాళ్లు. 15 శాతం మంది 51-60 మధ్య వయస్కులు. 12 శాతం మంది 15-30 సంవత్సరాల యువకులు. 14 శాతం మంది 14 సంవత్సరాల వయసు లోపలి వాళ్లే. వీటితో పాటు 5825 శిశుమరణాలు కూడా నమోదయ్యాయి. ఇంటి వద్దే పురుడు పోసుకున్న శుశువుల్లో 60 శాతం మంది చనిపోయారు.

Labels: , ,