World Public Services

Telugu News for change makers

20090915

శ్రీవారి ప్రసాదానికి భౌగోళిక అనుకరణ హక్కు


లడ్డూ లాంటి కబురు! తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే తిరుపతి లడ్డూకు భౌగోళిక అనుకరణ హక్కు (జియోగ్రాఫికల్ కాపీరైట్) లభించింది. వేరెవరు కూడా తిరుపతి లడ్డూ పేరును ఉపయోగించుకోకుండా, ఆ పేరుతో మిఠాయిని మార్కెట్ చేయకుండా జీఐ నిషేధిస్తుంది. ఓ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ.. భక్తులకు అందించే ప్రసాదాన్ని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ-జీఐఆర్)లో నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి.
శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత ఎనలేనిది. తిరుమల వెళ్లిన భక్తులను లడ్డూలు తెచ్చారా అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా అడిగి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతటి రుచి, ప్రాముఖ్యం ఉన్న దృష్ట్యా చాలాకాలంగా దీనిపై హక్కులు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. చెన్నైలోని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజస్ట్రీ-జీఐ)లో రెండేళ్ల క్రితం ఈ హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫున అప్పటి ఈవో రమణాచారి దరఖాస్తు చేశారు.మంగళవారం ఢిల్లీలోని ప్రధాన కేంద్రం నుంచి జాబితాలో చేర్చినట్లు సమాచారం అందింది. ''తిరుపతి లడ్డూను గుర్తిస్తూ జీఐ ధ్రువీకరణ పత్రాన్ని తితిదేకు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ లడ్డూకు చట్టం రక్షణ ఇస్తుంది. దీన్నెవరూ అనుకరించలేరు'' అని ట్రేడ్‌మార్క్స్, జీఐ సహాయ రిజిస్ట్రార్ వర్మ వెల్లడించారు. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కుల కంట్రోలర్-జనరల్ పి.హెచ్.కురియన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇకపై తితిదే అనుసరించే 'దిట్టం' ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఆధ్యాత్మిక, ఇతర సంస్థలు, వ్యక్తులు లడ్డూలను తయారు చేయరాదు. ఈ నమూనాను కూడా ఇతరులు అనుకరించే వీలు లేదు. 51 వేల లడ్డూలను 'దిట్టం'గా పరిగణిస్తారు. 'దిట్టం' కింద శనగపిండి-2 వేల కిలోలు, చక్కెర-4 వేల కిలోలు, నెయ్యి-1850 కిలోలు, గోడంబి-350 కిలోలు, ద్రాక్ష-87.5 కిలోలు, యాలకులు-50 కిలోలు, కలకండ-50 కిలోలు లడ్డూ తయారీకి వినియోగిస్తారు. లడ్డు తయారీ, నమూనా, దిట్టం, ఆకారాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవు.

జీఐ ప్రకారం.. ఒక ఉత్పత్తిని విక్రయించుకునే హక్కు సంబంధిత భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఆ హక్కు లభించిన ఉత్పత్తులు అదే ప్రాంతంలో తయారు కావాలి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా విశిష్టత సాధించిన బ్రాండ్‌నేమ్‌ను మరెవరూ సొమ్ము చేసుకోకుండా ఈ హక్కు సంరక్షిస్తుంది. హక్కును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. భౌగోళిక అనుకరణ హక్కు.. మేధో సంపత్తి హక్కుల్లో భాగం.

భూమాత గొడుగును కాపాడుకుందాం

భూమాత గొడుగును కాపాడుకుందాం
సెప్టెంబరు 16 ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
'ప్రకృతికి మన అవసరాలు తీర్చగల స్థోమత ఉంది. కానీ.. పెరుగుతున్న జనం అత్యాశను మాత్రం తీర్చలేదు' - గాంధీజీ
'ప్రకృతితో సహజ జీవనం తల్లీబిడ్డల బంధం. ఆధునిక పరిజ్ఞానంతో సహజమైన పర్యావరణాన్ని అశ్రద్ధ చేస్తూ మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కుంటున్నాం' - పర్యావరణవేత్తలు

అందమైన జలపాతాలు.. అరుదైన జీవజాతులు.. ప్రకృతిలోని ప్రతి అణువూ మనసును పులకింపజేసేవే. అయితే అవన్నీ కాలగర్భంలో కలసి పోయే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉంది. భావి తరాలకు సంపద సృష్టించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమించే మనిషి.. ఆరోగ్యకరమైన ప్రకృతిని ఇచ్చే విషయాన్ని మరుస్తున్నాడు. సాంకేతిక ముసుగులో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి కంటిపాపలా సంరక్షిస్తున్న ఓజోన్ పొరను మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. తద్వారా మనతోపాటు జీవజాలం ప్రకృతి సంపదను కాలగర్భంలో కలిపేస్తున్నాం. బుధవారం అంతర్జాతీయ 'ఓజోన్ పరిరక్షణ' దినోత్సవం. ఈ సందర్భంగా ఓజోన్ పొర ప్రాధాన్యాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని, మన కర్తవ్యాలను ఓసారి పరికిద్దాం.
ఓజోన్ పొరకు ఏర్పడిన చిల్లులు మానవాళికి తెచ్చే పెనుప్రమాదం గుర్తించిన ఐరాస 1987 సెప్టెంబరు 16న కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచ సదస్సు నిర్వహించింది. మోక్ట్రియల్ ప్రోటోకాల్‌ను ఖరారుచేసింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 16ను పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు.

ఏమిటీ ఓజోన్
భూమికి 15-25 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఓజోన్ పొర ఉంటుంది. ఇది మానవాళికి రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటుంది.
  • సూర్యుని నుంచి వచ్చే కిరణాల్లో అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. వీటిలో అల్ట్రావయొలెట్ బి రేడియేషన్, అల్ట్రా వయొలెట్ సి రేడియేషన్ అని రెండు ఉంటాయి.
  • అల్ట్రా వయొలెట్ సి రేడియేషన్ చాలా ప్రమాదకరమైంది. సూర్య కిరణాలు భూమికి చేరుకునే ప్రయాణంలో సి రేడియేషన్‌ను ఓజోన్ పొర పూర్తిగా అడ్డుకుంటుంది. బి రేడియేషన్‌ని వీలైనంత తగ్గిస్తుంది.
గొడుగుకు రంధ్రాలు
  • ఓజోన్ పొర ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లు నార్వే ప్రధాని గ్రోహార్లెన్ ఆధ్వర్యంలోని కమిషన్ 1987లో ఐరాసకు నివేదిక సమర్పించింది.
  • దక్షిణధ్రువం, ఉత్తరధ్రువం దగ్గర ఓజోన్ పొర దెబ్బతిన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
  • యూరప్ కెనడాల్లో ఈ తీవ్రత అధికంగా ఉంది. దీని ప్రభావం పిల్లలపై పడకుండా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పాఠశాల్లో పిల్లల్ని బయటకు రానీయవద్దని ఆంక్షలు కూడా విధించారు. ఒకవేళ బయటకు వచ్చినా ఈ కిరణాల నుంచి కాపాడే తొడుగులు, లేపనాలు వినియోగించేవారు.
ఐరాస ప్రాధాన్యం
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణానికి ప్రాముఖ్యతనిచ్చింది. అప్పట్లో లక్షలాది మందిని బలిగొన్న మలేరియా మహమ్మారిని అదుపు చేసేందుకు డీడీటీ విచ్చలవిడిగా వాడారు. దోమల నాశకానికి వినియోగించిన ఈ మందు ప్రభావంతో పర్యావరణానికి మేలు చేకూర్చే వందలాది క్రిమికీటకాలు, పక్షులు అంతరించాయి. జీవ వైవిధ్యం సమతుల్యం కోల్పోయింది.
కారణాలు
  • క్లోరోఫ్లోరో కార్బన్స్ (సీఎఫ్‌సీ) అనే వాయువు ఓజోన్ పొర క్షీణతకు కారణం. ఏసీ, ఫ్రిజ్‌లు వంటి వాటి నుంచి ఇది విడుదలవుతుంది.
  • మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, రసాయన వ్యర్థాలు కూడా విఘాతం కలిగిస్తున్నాయి.
  • అమెరికా సహా 12 యూరప్‌దేశాలు ప్రపంచం మొత్తమ్మీద మూడు వంతుల సీఎఫ్‌సీ విడుదల చేస్తున్నాయి.
  • రసాయనక ఎరువుల్లోని నైట్రోజన్ ఆక్సైడ్‌లు ఓజోన్‌పొరను తినేస్తున్నాయని 1970ల్లో పాల్ క్రటజన్ హెచ్చరించారు.
  • ఓజోన్ పొరను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు నిషేధించిన కొన్ని రకాల గ్యాస్‌లు, వాయువుల వల్ల రెండేళ్లుగా ఓజోన్ స్థితి కొద్దిగా కుదుటపడ్డట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
బాధ్యతలు
  • పర్యావరణం, ఓజోన్‌పై ప్రభుత్వాలు అవగాహన పెంపొందించాలి. స్థానికంగా సదస్సులు నిర్వహించాలి.
  • ఫ్రియాన్, సీఎఫ్‌సీల వాడకాన్ని ఆరికట్టాలి
  • ప్రత్యామ్నాయంగా వచ్చిన వస్తువులను ఉపయోగించాలి
  • ఓజోన్‌కు నష్టం కలిగించే పరిశ్రమలను క్రమంగా నిషేధించాలి.పచ్చదనాన్ని పెంపొందించాలి.
విపరిణామాలు
  • ఇంటి కప్పు.. బీటలు వారితే.. ఎండకు ఎండుతూ వానకు వానకు తడుస్తూ ఉండగలమా! భూమిని సంరక్షించే గొడుగు(ఓజోన్) క్షీణించడం వల్ల అలాంటి పరిస్థితే ప్రస్తుతం ఎదురవుతోంది.
  • భూతాపం, రుతుపవనాలు గతి తప్పడానికి ఇదే కారణం
  • మానవుల్లో చర్మ క్యాన్సర్, వాధ్యి నిరోధక శక్తి క్షీణించడం, కంటి శుక్లాలు వంటి భయంకర ఇక్కట్లు తలెత్తుతాయి.
  • వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని పంట దిగుబడులు తగ్గిపోతాయి.

భారత్‌లో..
  • ఆరేళ్ల కిందట ఐఐటీ కాన్పూర్, అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ వర్సిటీ భారతదేశంలో ఓజోన్ పొరలో వచ్చిన మార్పుల్ని రెండు ఉపగ్రహాల సాయంతో పరిశోధనలు జరిపాయి.
  • ఓజోన్ పొర మందాన్ని డాబ్సన్ యూనిట్ల(డీయూ)లో కొలుస్తారు. సాధారణంగా ఈ పొర 300 నుంచి 500 డీయూల మందం కలిగి ఉంటుంది. గంగానదీ పరివాహ ప్రాంతాల్లోని పట్టణాలైన కాన్పూర్, కొల్‌కతా, పాట్నా, వారణాసిల్లో ఉండాల్సిన మందంతో పోలిస్తే 12.6, 10.8, 13.5, 11.3 డీయూలు తగ్గినట్లు అంచనా వేశారు.

20090912

ఎల్ఐసీపై ఎన్‌సీడీఆర్‌సీ తీవ్ర విమర్శ

పాలసీని జారీ చేసేటప్పుడే ఆ పాలసీ తాలూకు నియమ నిబంధనలను పూర్తిగా తెలియజేయకుండా పాలసీదారు ప్రయోజనాలను ఎంత మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడమేమిటని భారతీయ జీవిత బీమా సంస్థను (ఎల్ఐసీ) జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం (ఎన్‌సీడీఆర్‌సీ) తీవ్రంగా విమర్శించింది. బీమా ఏజెంట్లు ఎంత సేపూ కంపెనీ పాలసీలను అధిక సంఖ్యలో విక్రయించి ప్రీమియం మొత్తాలను గరిష్ఠ స్థాయిలో సేకరించడం, తద్వారా తాము కూడా సొమ్ము చేసుకోవడం పైనే ఆసక్తితో ఉంటున్నారని ఎన్‌సీడీఆర్‌సీ సభ్యులు ఆర్.కె.బట్టా, పి.డి.షెనాయ్‌లు అధిక్షేపించారు. ఒక కేసు విషయంలో ఎల్ఐసీ వినతిని వారు తోసిపుచ్చుతూ, ఈమేరకు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కేసు వివరాలు: సునీల్ జైన్ 2002లో తన కుమార్తె బేబీ మోనా జైన్ కోసం ఒక ఎల్ఐసీ పాలసీని తీసుకొన్నారు. బీమా రిస్క్ ప్రారంభం అయ్యే కన్నా ముందే, 2005లో మోనా చనిపోయింది. దీంతో పాలసీ కూడా రద్దయిపోయింది. జైన్ పరిహారం కోసం దరఖాస్తు ఇవ్వగా, ఆ క్లెయిమును ఎల్ఐసీ తిరస్కరించింది. పాలసీ ప్రత్యేక నియమాలను ఎల్ఐసీ ఏజెంటు తనకు విడమరచి చెప్పలేదని, మొదటి విడత ప్రీమియం చెల్లించిన నాటి నుంచి రిస్క్ అమలులోకి వచ్చిందని తాను భావించానని జైన్ వాదించారు. పాలసీ జారీ సమయంలో పాలసీకి సంబంధించిన అన్ని క్లాజులను ఏజెంటు జైన్‌కు తెలియబరచలేదు. ''కవర్ నోట్''లో మాత్రమే పాలసీ షరతులను పేర్కొన్నారు. (బీమా పాలసీని జారీ చేస్తున్నట్లు తెలిపే పత్రమే కవర్ నోట్. ఇందులో పాలసీ తాలూకు పూర్తి సమాచారం పొందుపరచి ఉంటుంది). కవర్ నోట్‌ను పరిశీలించిన కమిషన్, పాలసీని ప్రతిపాదించిన తేదీ నాటి నుంచి నాలుగు సంవత్సరాలు గడచిన తరువాత మాత్రమే అమల్లోకి వస్తుందన్న ప్రత్యేక నిబంధన, రిస్క్ ప్రారంభం అయ్యే లోపే సంభవించిన పక్షంలో పాలసీ రద్దు అవుతుందన్న వివరణ అందులో ఉందన్న సంగతిని గుర్తించింది. ప్రీమియం వసూలు చేసి, కవర్ నోట్‌ను జారీ చేసే కన్నా ముందే వినియోగదారుకు పాలసీ క్లాజులన్నింటినీ వివరించడం ఎల్ఐసీ, ఆ సంస్థ ఏజెంట్‌ల కర్తవ్యమని కమిషన్ స్పష్టం చేసింది.

20090901

డ్రైక్లీనింగ్‌తో వైరస్‌ను పారదోలతాం

స్వైన్‌ఫ్లూపై మార్కెటింగ్ ఎత్తుగడలు
దేశంలో స్వైన్‌ఫ్లూ ఆందోళనల నెలకొనడంతో పలు కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్వైన్‌ఫ్లూ నిరోధించే కొత్త ఉత్పత్తులు, సేవలు అందిస్తామంటూ ప్రకటనలతో వూదరగొడుతున్నాయి. ఒక కంపెనీ అయితే ఏకంగా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే డ్రైక్లీనింగ్ మా వద్ద ఉందంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇలాంటి వాటిని విశ్వసించవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సూక్ష్మజీవులను చంపే మందుతో బట్టలను డ్రైక్లీనింగ్ చేయిస్తే వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని డైమండ్ ఫ్యాబ్‌కేర్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ''స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని నిరోధించడానికి బట్టల్ని మీ ఇంట్లో ఉతుక్కోవడం కంటే డ్రైక్లీనింగ్‌కు ఇవ్వడం మేలు. వైరస్, ఇతర క్రిములను సంహరించేందుకు మేం.. కొంచెం ఎక్కువ మోతాదులో కీటకనాశనిని వాడుతున్నాం'' అని ఆ సంస్థకు చెందిన ఎ.శ్రీవాస్తవ చెప్పారు. మరోపక్క లిక్విడ్ సోప్‌కు, చేతులు కడుక్కునేందుకు వాడే జెల్ వంటి వాటికి గిరాకీ విపరీతంగా పెరిగిందని ఢిల్లీకి చెందిన ఓ మందుల దుకాణం నిర్వాహకుడు చెప్పారు. ''ఇంతకుముందు.. ఇలాంటి ఉత్పత్తుల సామర్థ్యంపై వంద ప్రశ్నలు గుప్పించే వినియోగదార్లు ఇప్పుడు స్వైన్‌ఫ్లూ దెబ్బకు విపరీతంగా కొనేస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

స్వైన్‌ఫ్లూ నేపథ్యంలో వస్తున్న మార్కెటింగ్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రజలను హెచ్చరించింది. ''వైరస్‌ను డ్రైక్లీనింగ్ నిరోధిస్తుందని రుజువు చేస్తుందని ఏ అధ్యయనంలోనూ రుజువుకాలేదు'' అని మండలి డైరెక్టర్ వి.ఎం.కటోచ్ తెలిపారు. వాణిజ్య ప్రయోజనాల కోసం పలు కంపెనీలు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్‌కు చెందిన ఎన్.కె.పాండే తెలిపారు.

స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి: స్వైన్‌ఫ్లూ వ్యాధితో పుణెలో ప్రియాంక షిమిల్కర్ అనే ఏడేళ్ల బాలిక మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 103కు చేరింది. దీనికితోడు వివిధ ప్రాంతాల్లో తాజాగా మరో 100 కొత్త కేసులు నమోదయ్యాయి.

డిసెంబర్‌లో టీకా కొనుగోలు: స్వైన్‌ఫ్లూ టీకా పరీక్షల అంశంలో భారత్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలను కేంద్రం ఖండించింది. భారతీయులపై ఈ టీకాను పరీక్షించడానికి ఒక కంపెనీ సంసిద్ధత వ్యక్తంచేసిందని వైద్య సేవల డైరెక్టర్ జనరల్ ఆర్.కె.శ్రీవాస్తవ తెలిపారు. గ్కాక్సో-స్మిత్‌క్త్లెన్ సంస్థ సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. నమూనాలను సేకరించే, పరీక్షించే, రవాణా చేసే సిబ్బందికి మొదట ఈ టీకాను ఇస్తామని వివరించారు. డిసెంబర్ నుంచి టీకాను గ్లాక్సో సంస్థ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందన్నారు.

మధుమేహం, గుండె జబ్బులు ఉంటే జాగ్రత్త: మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, రక్తహీనత ఉన్న వారికి స్వైన్‌ఫ్లూ సోకితే పరిస్థితి విషమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరు వ్యాధిని గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. దేశంలో హెచ్1ఎన్1 వైరస్ వల్ల కలిగిన మరణాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ శివలాల్ తెలిపారు. 82 మరణాలను విశ్లేషించామని, ఇందులో 37 మంది అప్పటికే వారికి ఉన్న తీవ్రమైన వ్యాధులవల్ల పరిస్థితి విషమించి చనిపోయారని చెప్పారు.

రాష్ట్రంలో మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తాజాగా మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధిబారిన పడ్డవారి సంఖ్య 195కి చేరింది. మంగళవారం ఐదుగుర్ని తీసుకొచ్చి ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో 25 ఏళ్ల యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్వైన్‌ఫ్లూ కేంద్రం సమన్వయకర్త శుభకర్ తెలిపారు. గత నెల 12న వ్యాధి నిర్ధరణ కోసం ఢిల్లీకి పంపిన నమూనాల్లో 10 మందికి వ్యాధి సోకినట్లు నివేదిక అందినట్లు ఆయన చెప్పారు.

స్వైన్‌పై ఆయుర్ యుద్ధం
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాప్తిని ఆయుర్వేద మందులతో నియంత్రించవచ్చని విజ్ఞాన భారతి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి జయకుమార్ మంగళవారం తెలిపారు. ఆయుష్ పరిశోధన విభాగం, విజ్ఞాన భారతి సంయుక్తంగా స్వైన్‌ఫ్లూ వ్యాప్తి నియంత్రణకు పలు ఆయుర్వేద సూచనలు చేసిందన్నారు. నాలుగు సులభ పద్ధతులతో స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గీతాకృష్ణన్ తెలిపారు.
ఇలా జాగ్రత్త పడదాం
ఎనిమిది మూలికలతో తయారు చేసిన అపరాజిత ధూపం రోజుకు రెండు సార్లు తరగతి గదులు, రద్దీ ప్రాంతాల్లో వేస్తే ఫ్లూ వ్యాప్తిని నియంత్రించవచ్చు.
నాలుగు గంటలకు ఒకసారి తిలా తైలాన్ని వాసన చూడటం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు.
పసుపుకొమ్మును నేతిలో ముంచి, తర్వాత కాల్చగా వచ్చే పొగను ముక్కుతో పీల్చి నోటితో వదలాలి. దీంతో వైరస్ శరీరంలో ఉంటే వెంటనే చనిపోతుంది.
తులసిని తినడం వల్ల ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.

20090830

నీరుగారిన 'కిట్ల' పథకం!

తాగునీటిస్వచ్ఛతను నిర్ధరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం నీరు కారిపోయింది. మంచినీటిని విశ్లేషించేందుకు రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కిట్లు అటకెక్కాయి. వీటిని కొనటంలో కనపరచిన ఆత్రుత వినియోగించటంపై చూపటంలో ప్రభుత్వం విఫలమైంది.
తాగునీటి కాలుష్యంతో ఇరవై శాతం పైగా వ్యాధులు ప్రబలుతున్నట్లు తేలటంతో మంచినీటిని విశ్లేషించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోపంచాయతీలను భాగస్వాములుగా చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రాజీవ్‌గాంధీ తాగునీటి పథకం కింద నిధులను కూడా మంజూరు చేసింది. చేతి పంపులు, రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేసే నీటిని విశ్లేషించాలని పేర్కొంది. ఇందుకోసం 22 వేల గ్రామ పంచాయతీలకు నీటి విశ్లేషణ కిట్లను రెండు దఫాలుగా సరఫరా చేశారు. 2007లో తొలి విడత కింద కొన్న కిట్ ధర రూ.2,500 కాగా తరువాత దీన్ని రూ.2 వేలుగా నిర్ణయించారు. కిట్ల వినియోగంపై గ్రామ సర్పంచి, సైన్స్ ఉపాధ్యాయుడు, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. తరువాత దీని గురించి మరచిపోవటంతో ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన దాదాపు రూ.19 కోట్లు నీటి పాలయ్యాయి.

కిట్లు ఏం చేస్తాయి..
 తాగునీటిలోని తొమ్మిది రకాల కారకాలను కిట్ల ద్వారా విశ్లేషించవచ్చు. సాంద్రత, ఆమ్లత్వం, కఠినత్వం, గాఢత్వం, క్లోరిన్, ఫ్లోరైడ్ స్థాయిని గుర్తించేందుకు ద్రావకాలను కూడా సరఫరా చేశారు. ద్రావకాల కాలపరిమితి ఏడాదిన్నర మాత్రమే. దీంతో కిట్లను వాడకుండానే వీటిని మూలన పడేసే పరిస్థితి నెలకొంది.

 గ్రామస్థాయి విశ్లేషణలో నీటిలో కారకాలు ఉన్నాయని తేలితే వాటిని జిల్లాస్థాయి ప్రయోగశాలకు పంపాలి. అక్కడ నుంచి పది శాతం నమూనాలు రాష్ట్రస్థాయి ప్రయోగశాలకు రావాలి. ఇక్కడకు ఇంత వరకూ ఒక్క శాంపిల్ కూడా రాలేదని సమాచారం. ఈ విధానాన్ని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానించాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.

నీటిని విశ్లేషించే వ్యక్తికి ప్రతి నెలా రూ.100 గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించినా, నిధులను మాత్రం విడుదల చేయలేదు. సైన్స్ ఉపాధ్యాయులైతే అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో వారికి శిక్షణ ఇచ్చారు. వీరిలో చాలా మంది బదిలీపై వెళ్లిపోయారు.

ప్రతి కుటుంబం నుంచి రూపాయి చొప్పున నిర్వహణ వ్యయం వసూలు చేయాలని తొలుత నిర్ణయించారు. చాలామందికి కిట్లు వచ్చిన విషయమే తెలియకపోవడంతో వసూళ్లు జరగలేదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద పంచాయతీలకు ఇచ్చే నిధుల నుంచి దీనికి కేటాయించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.

పంప్ మెకానిక్‌లు గతంలో బాక్టీరియాకు సంబంధించిన పరీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో శిక్షణ పొందిన వారికే ఈ బాధ్యతలు అప్పగించాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.

శుభ్రమైన మంచినీరు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా సరఫరా చేసే నీటిని పరీక్షిస్తామని చెబుతోంది. ఇది జరగాలంటే పంపిణీ చేసిన కిట్లను వాడుకోవాలి. గ్రామస్థాయిలో శిక్షణ పొందిన వారి సేవలను వినియోగించుకోవాలి. కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడినప్రయోగశాలలనూ పటిష్ఠ పరచాలి.

20081222

వారసులకు పరిహారం చెల్లించాలి : సుప్రీం

పాలసీదారుని మృతిని తెలుపక పోయినా మోటారు వాహన బీమా సంస్థ మృతుని వారసులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకు రుణంతో ఒక ట్రక్‌ను ఆత్మారామ్‌ కొనుగోలు చేశాడు. ఈ వాహనానికి యునైటెడ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ బీమా పాలసీని తీసుకున్నాడు. 1991లో ఆత్మారామ్‌ మరణం తరువాత ఈ వాహనాన్ని నడుపుతున్న అతని వారసులు రిజిస్ట్రేషన్‌ మార్పిడి చర్యలు తీసుకోలేదు. బీమా మొత్తాన్ని ఆత్మారామ్‌ పేరిటే ఏటా బ్యాంకు ద్వారా చెల్లించారు. 1994 సెప్టెంబర్‌ 15న ఈ వాహనానికి ప్రమాదం సంభవించడంతో డ్రైవర్‌ చత్తార్‌సింగ్‌ మరణించాడు. మృతుని కుటుంబానికి రూ.1.42 లక్షలు చెల్లించాలని కార్మిక పరిహార కమిషనర్‌ బీమా కంపెనీని ఆదేశించారు. పాలసీదారుడు మరణించిన కారణంగా పరిహారాన్ని చెల్లించలేమని బీమా సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు.. పాలసీ రెన్యూవల్‌ సమయంలో తనిఖీ చేయాల్సిన బాధ్యత కంపెనీదే అయినందున, పరిహారం చెల్లింపును తిరస్కరించలేరని స్పష్టం చేసింది. దీంతో బీమాసంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణాన్ని తెలియచేయలేదని పరిహారం చెల్లింపునకు నిరాకరిస్తున్న సంస్థ, ప్రీమియంను స్వీకరించడకుండా ఉండాల్సిందని జస్టిస్‌ ఎస్‌బీ సిన్హా, సిరియాక్‌ జోసెఫ్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Labels:

సమాచారం అందడంలేదు!

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) పలు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మొత్తం చట్టం ఉద్దేశమే దెబ్బతింటోందని పేర్కొంది. గుజరాత్‌, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లలోని కొన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఆర్‌ఐఏ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం నిర్వహించింది. మొత్తం పది రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వే ఫలితాలను 'ఆర్‌టీఐ కింద సమాచారం పొందడం: ప్రజల అనుభవం' పేరుతో విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లో 90శాతం మంది, కేరళలో 84శాతం మంది ప్రజా సమాచార అధికారుల (పీఐఓ) నుంచి కోరిన సమాచారాన్ని పొందుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో 55శాతం, రాజస్థాన్‌లో 66శాతం, హర్యానాలో 68శాతం మందికి అది లభిస్తోందని పేర్కొంది. మొత్తంమీద సగటున 68.41శాతం మందికి మాత్రమే కోరిన సమాచారం లభ్యమవుతోంది. బీహార్‌, జార్ఖండ్‌లలో కేవలం 45శాతం మంది దరఖాస్తుదారులకు మాత్రమే కావాల్సిన సమాచారం లభిస్తోందని తెలిపింది. ప్రజలు కోరిన సమాచారం ఇచ్చే విషయంలో పీఐఓలు ఆలస్యంగా స్పందించడం వల్లే ఈ చట్టం ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదని సర్వే పేర్కొంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు చేసిన 150 రోజుల తర్వాతే అధికారులు ఆ సమాచారం అందిస్తున్నారని, పైగా అందుకోసం దరఖాస్తుదారుడు కనీసం ఐదుసార్లు వారిచుట్టూ తిరగాల్సి వస్తోందని వెల్లడించింది. దాదాపు 43శాతం మంది దరఖాస్తుదారులు రెండు నుంచి ఐదుసార్లు సంబంధిత విభాగాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. బీహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌లలో పరిస్థితి మరీ ఘోరంగాఉందని పేర్కొంది. 20శాతం మందికి పైగా దరఖాస్తుదారులు సంబంధిత అధికారుల వద్దకు పదిసార్ల కంటే ఎక్కువగానే వెళ్లాల్సి వస్తోందని తెలిపింది.

Labels:

రూ.527 కోసం పదేళ్ల న్యాయపోరాటం

పదేళ్ల న్యాయపోరాటం చేసిన ఓ వృద్ధుడు చివరకు విజయం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం తపాలా కార్యాలయం నుంచి బి.ఆర్‌.శర్మ (75) 1996లో రూ.3వేలు రుణం తీసుకున్నాడు. గడువుకు ముందే రుణాన్ని చెల్లించేశాడు. అయినా కార్యాలయం రూ.527 ఎక్కువగా వసూలు చేసింది. దీనిపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి రూ.వెయ్యి ఖర్చు చేశారు. పదేళ్ల పోరాటంతర్వాత వినియోగదారుల ఫోరం శర్మకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అతనికి రూ.527తో పాటు న్యాయ పోరాటానికైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. శర్మ న్యాయవాది సునీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ 'ఈ పోరాటం కేవలం రూ.527 కోసం కాదని వ్యవస్థలోని లోపాలపైనేనని' పేర్కొన్నారు.

Labels:

20080414

బ్యాగును పోగొట్టినందుకు రూ. 2 లక్షల పరిహారం

బ్యాగును రవాణా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూ. రెండు లక్షలు పరిహారంగా ప్రయాణికునికి చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. స్థానిక న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అంకాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న డాక్టర్ రాకేష్ చోప్రా 1998 నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఏథెన్స్ వెళ్లారు. అక్కడ విమానం దిగిన తరువాత తన పరిశోధనాపత్రాలున్న బ్యాగు కనిపించకుండా పోయిన విషయాన్ని డాక్టర్ రాకేష్ గుర్తించారు. ఇతర బ్యాగులు కూడా కదిలించినట్టు కనిపించాయి. పోయిన బ్యాగు ఆచూకీ కోసం సిబ్బంది చేసిన యత్నం ఫలించలేదు. దీంతో ఆయన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనలేకపోయారు. తరువాత ఢిల్లీ వినియోగదారుల కమిషన్‌ను డాక్టర్ రాకేష్ ఆశ్రయించారు.

20080306

498(ఎ) చట్టంలో మార్పులు తేవాలి

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ రక్షణ చట్టాల దుర్వినియోగాన్ని ఖండిస్తూ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో సంస్థ ప్రతినిధులు చల్లా ఉమా, అనురాధ, విజయభారతితో పాటు పలువురు బాధితులు పాల్గొని దుర్వినియోగం అవుతున్న 498(ఎ) చట్టంలో వెంటనే మార్పులు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టం పలువురు అమాయకులను నిర్బంధంలోకి తోసేస్తుందన్నారు. ఒక పురుషుడికి తల్లి, చెల్లి, అక్క, వదిన అయిన పుణ్యానికి 498(ఎ) చట్టం వల్ల అరెస్టు అవుతున్నారని  అన్నారు. నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సదరు మహిళ ఇచ్చే ఫిర్యాదుతో కుటుంబసభ్యులు అరెస్టు కావాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఫిర్యాదుదారులు మాత్రమే మహిళలా? ఇతరులు కారా? అని ప్రశ్నించారు. ఈ చట్టం కింద ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ అరెస్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళల హక్కుల పరిరక్షణ పేరిట అమాయకుల మానవ హక్కులను ఉల్లఘించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 'వరకట్నం' పేరిట పెడుతున్న కేసుల వల్ల ఎన్నో జీవితాలు బలయ్యాయని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా 498(ఎ) చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీపుల్స్ గ్రీవెన్స్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్‌యాదవ్, బాధిత తల్లులు సరోజినీదేవి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొని మాట్లాడారు.

గంటపాటు విద్యుత్తు ఉపకరణాలకు స్వస్తి

విద్యుత్తు పొదుపుతో పాటు భూతాపానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా  ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందరూ ఇళ్లల్లో ఉన్న విద్యుత్తు దీపాలు ఆర్పి ఉద్యమానికి చేయూతనివ్వాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాఘవేందర్ కోరుతున్నారు. ముంబయిలో డిసెంబర్ 15న నిర్వహించిన 'బత్తీ బంద్' కార్యక్రమమే తమకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు.  ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి నగరంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న యువత రాఘవేందర్, మోహన్, మధుకర్, రజిత, పుష్కర్, సంపత్, షవాలీ నడుం బిగించారు. వీరంతా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు. ఏదైనా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఉద్యమం. ఈ కార్యక్రమానికి గ్రేటర్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ, నెడ్‌క్యాప్ తదితర సంస్థలూ సహకరిస్తున్నాయి. వివరాలకు 99088 15490లో సంప్రదించవచ్చన్నారు.

20080212

ఢిల్లీలో నో స్మోకింగ్‌ బోర్డు తప్పనిసరి

ఢిల్లీ లోని రెస్టారెంట్లు, గెస్టు హౌస్‌ల ముందు 'నో స్మోకింగ్‌ ఏరియా' బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఢిల్లీ పోలీసులకు వాణిజ్య సంస్థలకు హెచ్చరికలు జారీచేశారు. లేనట్త్లెతే యజమానులు రూ.500 జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. 1996 ఢిల్లీ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్మోకింగ్‌, నాన్‌స్మోకర్స్‌ హెల్త్‌ సంరక్షణ చట్టం కింద నగరంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఈటింగ్‌ హౌస్‌లు, గెస్టు హౌస్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చట్టంలోని 10వ సెక్షన్‌ ప్రకారం ప్రజలు ఎక్కువగా వచ్చే ఆయా సంస్థల వద్ద ఉండే ముఖ్యమైన ప్రదేశాలు లేదా రాకపోకల గేట్ల వద్ద నో స్మోకింగ్‌ జోన్‌, పొగ తాగటం నేరం అనే బోర్డులు ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వ్యక్తికి మొదటిసారి రూ.100, రెండోసారి రూ.200 జరిమానాగా చెల్లించాలి. ఈ జరిమానా రూ.500 వరకు పొడిగించవచ్చు.
డీయూలో ఫిబ్రవరి నెల 15 నుంచి ధూమపాన నిషేధం అమలు
ఢిల్లీ యూనివర్సిటీలో ఫిబ్రవరి 15 నుంచి ధూమపాన నిషేధం అమలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు సర్క్యులర్లు జారీ చేశారు. పొగ తాగకూడదనే సందేశాన్ని వీధి నాటకాలు ప్రదర్శించడం, గోడలపై పెయింటింగ్‌లు, పోస్టర్లను అతికించడం ద్వారా ప్రచారం చేస్తున్నారు. క్యాంపస్‌ సమీపంలో సిగరెట్లను విక్రయించే దుకాణదారులను పంపించి వేశామని యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు అమృత బహ్రి అన్నారు. మొదటిసారి ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై రూ.200 జరిమానా విధిస్తారు. రెండో సారి ఉల్లంఘిస్తే రూ.500 వరకు ఫైన్‌ వేస్తారు.

వంటనూనె తయారీ యూనిట్లపై దాడి

వంటనూనె తయారీ యూనిట్లపై తూనికలు, కొలతల అధికారులు దాడులు చేసి 58 మిల్లులపై కేసులు నమోదు చేశారు. తక్కువ మోతాదులో అయిల్‌ను ప్యాకింగ్‌ చేస్తున్న యూనిట్లపై హైదరాబాద్‌, రంగారెడ్డిలకు చెందిన అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని గగన్‌పహాడ్‌, కాటేదాన్‌, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉన్న గోవర్దన్‌, మనియర్‌, అనీల్‌, అరుణ, గుడ్‌ హెల్త్‌ ఆగ్రోటెక్‌, షాలిమర్‌ డ్రాప్‌, ధూల్‌చంద్‌, పవన్‌, షాలిమర్‌, సర్దా, శీతల్‌, రామచరణ్‌ రిఫైనరీ అయిల్‌ యూనిట్లపై కేసులు నమోదు చేశామని లీగల్‌మెట్రాలజీ కంట్రోలర్‌ తెలిపారు.

20080114

సమాచార హక్కు దుర్వినియోగం

సమాచార హక్కు చట్టం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, శిక్షలకు సంబంధించిన నిబంధనలను చేరుస్తూ ఈ చట్టాన్ని సవరించాల్సి ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) అభిప్రాయపడింది. ' ఈ చట్టాన్ని దుర్వినియోగ ఉద్దేశంతో సమాచారం కోరే వారిని శిక్షించే చర్యలు తీసుకోడానికి వీలుగా ఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరాన్ని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి' అని కమిషన్‌ పేర్కొంటూ నవోదయ విద్యాలయకు చెందిన ఓ ఉపాధ్యాయుని దరఖాస్తును కొట్టివేసింది.
కేవలం ఆ బడిపై అక్కసు తీర్చుకోవడం కోసమే ఈ దరఖాస్తును ఆయుధంగా వాడుకోవాలని పిటిషనర్లు రమేశ్‌చంద్ర, ఆయన భార్య ఉమాకుమారి విశ్వప్రయత్నం చేసినట్టుగా కమిషన్‌ నిర్ధారించింది. రమేశ్‌ చంద్రను బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఆ దంపతులు తొలుత కేంద్ర పాలనా వ్యవహారాల ట్రిబ్యునల్‌ (సీఏటీ)ని ఆశ్రయించగా చుక్కెదురైంది. తరువాత హైకోర్టులోనూ, అనంతరం షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌లోనూ అదే పరిస్థితి. చిట్టచివరగా ఆర్టీఐకి అర్జీ పెట్టుకున్నారు. ఇదంతా గమనించిన సమాచార కమిషనర్‌ ఓపీ కేజారీవాల్‌ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే పారితోషికం

మనం పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే డబ్బులు చెల్లించడం ఎక్కడైనా ఉన్నదే. కానీ, వాడినందుకు మనకే డబ్బులిస్తోంది ఒక సంస్థ. ఒక్కసారికి పదిపైసల చొప్పున లెక్కకట్టి మరీ నెలవారీ చెల్లింపులు చేస్తోంది. తిరుచిరాపల్లి (కేరళ) సమీపంలోని ముసిరికి చెందిన సొసైటీ ఫర్‌ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ అలా చేస్తోంది! ఎరువుగా మలమూత్రాల వాడకంపై పరిశోధనలు జరిపే లక్ష్యంతో ఈ పని చేస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ సుబ్బరామన్‌ చెప్పారు.

వైద్యులు, ఆస్పత్రులు నిబంధనలను పాటించాలి

జాతీయ వైద్యమండలి నిబంధనలను రాష్ట్రంలోని వైద్యులు, ఆస్పత్రుల యాజమాన్యాలు విధిగా అనుసరించాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్యమండలి ఛైర్మన్‌ డాక్టర్‌ వల్లభనేని రాంప్రసాద్‌ కోరారు. ఇటీవల నిబంధనలను ఉల్లంఘించిన ఇరువురి వైద్యులపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాల వైద్యుడు వి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలు నిరూపణ అయ్యాయని తెలిపారు. తిరుపతికి చెందిన వైద్యుడు ఎం.శ్రీనివాసరావు కూడా నిబంధనలను ఉల్లంఘించినందున వీరిరువురి రిజిస్ట్రేషన్లు ఏడాది పాటు రద్దు చేస్తున్నామని చెప్పారు. ''వివిధ రకాల దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్స చేస్తామంటూ కొందరు వైద్యులు పత్రికలు, కరపత్రాల ద్వారా జారీచేస్తున్న ప్రకటనలు వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇకపై వైద్యులు, ఆస్పత్రులు ప్రకటనలు జారీ చేసేటప్పుడు నైతిక విధానాలను అనుసరించాలి'' అని కోరారు.

స్మార్టుకార్డులతో రూ.18 కోట్లు ఆదా

సామాజిక పింఛన్లు, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించే స్మార్టుకార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనివల్ల నకిలీలను అరికట్టడంతో పాటు ఏటా సుమారు రూ.18 కోట్లు ఆదా చేయవచ్చని అధికారుల అంచనా . ప్రస్తుతం వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ఆరు జిల్లాల్లో, వచ్చే డిసెంబర్‌ నాటికి రాష్ట్రమంతటా వర్తింపచేయాలని భావిస్తున్నారు. ఇందుకు 13 బ్యాంకులతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. మౌలిక వసతులను బ్యాంకులు సమకూర్చనున్నాయి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్మార్టుకార్డుల వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేయనుంది. అనంతరం తొలుత సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తారు. తర్వాత గ్రామాల్లో ఎంపికజేసిన మహిళలకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరి మూడోవారానికల్లా ముగించి లబ్ధిదారులకు స్మార్టుకార్డులను పంపిణీ చేస్తారు. తొలివిడతగా వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏప్రిల్‌ నుంచి స్మార్టుకార్డుల ద్వారా పింఛన్లు పంపిణీ ప్రారంభిస్తారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.

20071227

పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు

రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 24 గంటలూ పని చేసేలా మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో కిరోసిన్ బంకులను కూడా నెలకొల్పుతున్నట్లు చెప్పారు. దీన్ని నివారించడం కోసమే ముందుగా పాత తాలూకా కేంద్రాల్లో మందుల షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళలో పౌరసరఫరాల సంస్థ విజయవంతంగా మందుల షాపులను నడుపుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఖరీప్‌లో రైతులకు వరి ధాన్యం మద్దతు ధరలు లభిస్తున్నాయన్నారు. గ్రేడ్ ఏ రకం క్వింటాల్‌కు రూ.775 మద్దతు ధర ఉండగా.. మిలర్లు రూ.876 వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 62,446 మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని చెప్పారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 2009 నాటికి మహిళలకు 25 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఏపీ ఆన్‌లైన్‌లో ఉచితంగా తెలుగు సాఫ్ట్‌వేర్

 'ఏపీఆన్‌లైన్' www.aponline.gov.in లో తెలుగు సాఫ్ట్‌వేర్‌ను ఉంచామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ తెలిపారు. కంప్యూటర్ సాయంతో నిర్వహించే పాలన వ్యవహారాల్లోనూ తెలుగు వాడకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉంచినట్లు తెలిపారు. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని 'గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్' సూచికలో 'డౌన్‌లోడ్ తెలుగు సాఫ్ట్‌వేర్' ఉంటుందని తెలిపారు. విన్డోస్ ఎక్స్‌పీ ఉన్న కంప్యూటర్ల ద్వారానే డౌన్‌లోడ్ అవుతుంది.

20071226

సెల్‌లో విద్యుత్తు బిల్లు

సెల్‌ఫోన్ ఐదేళ్ల క్రితం వరకు సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకే ఉపయోగపడేది. ప్రస్తుతం ఈ ఫోన్ మరిన్నో సేవలను అందిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ పేపర్, మొబైల్ టీవీ... ఇలా వివిధ రకాలుగా రూపాంతరం చెందుతోంది. తాజాగా విద్యుత్తు శాఖ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్తుకు సంబంధించిన వివరాలను సెల్‌లో చూసుకునే వెసలుబాటు ఏర్పడింది. సీపీడీసీఎల్ అధికారులు జెనీవా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌తో కలిసి ఎస్.ఎం.ఎస్. ద్వారా విద్యుత్తు సంబంధిత సమాచారాన్ని వినియోగదారులకు అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సొంత భాషలో మెసేజ్‌లు పంపే సదుపాయం కల్పించింది. సీపీడీసీఎల్ ద్వారా సెల్‌ఫోన్ ఉన్న విద్యుత్తు వినియోగదారులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా బిల్లు వివరాలు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం వినియోగదారులు ముందుగా తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా విద్యుత్తు బిల్లు పంపడంతో పాటు, బిల్లు చెల్లించిన వెంటనే 'ధన్యవాదాలు' అంటూ సమాచారం పంపుతారు. వినియోగదారుడు ఉంటున్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో ఏమైనా అంతరాయాలుంటే ఆయా వివరాలూ పంపిస్తారు. ఇందుకు వినియోగదారుడికి అదనంగా ఎలాంటి ఛార్జీ పడదు. ఈ సేవలను మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితం చేశారు. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారు.
మొబైల్ వినియోగదారులు తమ విద్యుత్తు సర్వీసు నంబరు, ఈఆర్ కోడ్‌ను కంపోజ్ చేసి, 57333 నంబరుకు ఎస్ఎంఎస్ పంపి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెట్ అందుబాటులో ఉండే వినియోగదారులు www.apcentralpower.com  వెబ్‌సైట్‌లో 'మొబైల్ అలర్ట్స్' అనే లింక్‌లోకి వెళ్తే సరిపోతుంది. అక్కడ కోరిన సమాచారాన్ని అందజేసి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు

20071205

శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యానికి నష్టపరిహారం

శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యం ప్రదర్శించినందున చోడవరం ప్రాంతానికి చెందిన వైద్యుడొకరు రూ.50 వేలు నష్ట పరిహారంతోపాటు వైద్య ఖర్చులకు పది వేలు, మరో పది వేలు ఖర్చులకు ఫిర్యాదికి చెల్లించాలని విశాఖపట్నం జిల్లా వినియోగదారుల ఫోరం- 1 అధ్యక్షుడు వై.ఢిల్లీశ్వరరావు తీర్పు చెప్పారు. బాధితుడు ముమ్మిడిశెట్టి కృష్ణ ఈనాడుకు అందించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రావి కమతంలో గతంలో ముమ్మడి శెట్టి కృష్ణ ఉండేవాడు. ఆ సమయంలో అతని జననేంద్రియాల వద్ద ఇబ్బందిగా ఉండటంతో చోడవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ కె.సుందర్‌రామాన్ని సంప్రదించాడు. బాధితుడిని పరీక్షించిన ఆయన చిన్న శస్త్రచికిత్స అవసరమని, దీనికి రూ.1000 చెల్లించాలని తెలిపారు. బాధితుడు ఫీజు చెల్లించిన పిదప డాక్టరు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇది పూర్తయిన తర్వాత అతనికి మరింత ఇబ్బంది కలగటంతో డాక్టరును తిరిగి సంప్రదించాడు. సుందరరామం పరీక్షించి వైద్య చికిత్స చేసినా ఫలితం లేకపోవటంతో బాధితుడు నగరానికి చెందిన డాక్టర్ బి.రాంబాబును సంప్రదించారు. మొదట జరిగిన శస్త్ర చికిత్సలో తలెత్తిన మైనరు లోపాన్ని రాంబాబు సరిదిద్దారు. శస్త్ర చికిత్సలో జరిగిన నిర్లక్ష్యానికి నష్టపరిహారం కోరుతూ బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరం-1లో కేసు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం-1 అధ్యక్షుడు వై.ఢిల్లేశ్వరరావు పై తీర్పు ఇచ్చారు

20071130

ఆంధ్ర ప్రదేశ్లో సిటిజన్ ఛార్టర్లు

ఆంధ్ర ప్రదేశ్లో సిటిజన్ ఛార్టర్లను ప్రకటించిన కొన్ని సంస్థలు :
  • ఎ.పి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
  • ఎ.పి. ఫైర్ సర్వీసెస్
  • ఎ.పి. ఇండస్ట్రియల్ డవలప్మెంట్ కార్పొరేషన్
  • ఎ.పి. ట్రాన్స్కో/ డిస్కమ్
  • ఎ.పి. హౌసింగ్ బోర్డు
  • ఎ.పి. హౌసింగ్ కార్పొరేషన్
  • ఎ.పి. హౌసింగ్ ఫెడరేషన్
  • ఎ.పి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
  • ఎ.పి. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
  • ఎ.పి. పోలీస్
  • ఎ.పి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ
  • ఎ.పి. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
  • బి.సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్
  • బోర్డ్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్
  • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
  • బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
  • బాయిలర్స్ డిపార్ట్మెంట్
  • ఛీఫ్ ఇంజనీర్స్, నేషనల్ హైవేస్
  • సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్
  • కమీషనరేట్ ఆఫ్ టెండర్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హజ్బెండరీ
  • డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ హాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ
  • డిపార్ట్మెంట్ ఆఫ్ స్మాల్ సేవింగ్స్, లాటరీస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్
  • డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
  • ఇఎస్ఐ హాస్పటల్స్
  • గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్
  • జవహర్ బాల భవన్
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
  • మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్
  • పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్
  • ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ డిపార్ట్మెంట్
  • స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
  • స్టేట్ ఆర్చివ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  • తెలుగు అకాడమీ
  • డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (హోమియోపతి, ఆయుర్వేదిక్ హాస్పటల్స్)
  • దాదాపు జాతీయ బ్యాంకులన్నీ కూడా సిటిజన్ ఛార్టర్స్ను ప్రకటించాయి.

Labels:

20071129

యజమానులు కాదు - సేవకులు

సిటిజన్స్ ఛార్టర్
పౌరుల అధికార పత్రం
----గాలి ఉదయ కుమార్, కార్యదర్శి, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ, హైదరాబాద్
ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో ఒక చిన్న పని జరిగేందుకు 27 సంవత్సరాల ఆలస్యం జరిగిందంటే మీరు నమ్మగలరా? కాని ఇది నిజం. మద్రాస్ నివాసి లక్ష్మీ రాఘవాచారి తనకు అలాట్ అయిన ప్లాట్ పట్టాను ఇవ్వవలసిందిగా కోరుతూ 1965లో మైలాపూర్ తహసీల్దారుకు దరఖాస్తు పెట్టుకొన్నారు. 27 నిండు సంవత్సరాల పాటు ఆయనకు పట్టా లభించలేదు. సంబంధిత అధికారులకు ఆయన 101 ఉత్తరాలు వ్రాశారు. విసిగి వేసారి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసిన తర్వాత 1992లో ఆయనకు పట్టా లభించింది. ఒరిస్సాకు చెందిన చింతామణి మిశ్రా కొన్ని సర్టిఫైడ్ కాపీల కోసం తహశీల్దారు కార్యాలయంలో అవసరమైన ఫీజును చెల్లించారు. ఇక ఆ తర్వాత ఆయన బాధలు మొదలయ్యాయి. కార్యాలయం చుట్టూ 16 సార్లు ఆయన తిరగ వలసి వచ్చింది. తహశీల్దారునీ, సబ్ కలెక్టర్నీ, కలెక్టర్నీ కలిసినా ప్రయోజనం కనిపించలేదు. చివరకు ఫోరంను ఆయన ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవలసి వచ్చింది. ఇటువంటి సంఘటనలు ఒక్క ప్రభుత్వ సంస్థలకే పరిమితం కాదు. ప్రైవేట్ సంస్థల్లోను కోకొల్లలు.

సేవలను అందించే వారి అలసత్వం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా ఇటువంటి కష్ట నష్టాలకు మీరు ఎపుడైనా గురయ్యారా? సమస్య చిన్నదే కావచ్చు. వాటిల్లిన నష్టమూ పెద్దది కాకపోవచ్చు. రైల్వేలు, ఆర్టీసీ, బ్యాంకులు, టెలికామ్, విద్యుత్, పోస్ట్, కొరియర్ వంటి వివిధ సంస్థలు అందించే సేవల్లో లోపాలతో బాధ పడి, ఎందుకిలా అయ్యింది-మనం ఏమీ చేయలేమా అని నిస్సహాయంగా మానసిక క్షోభకు లోనయ్యారా?

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1998 డిసెంబర్ 12న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్ లేకుండా అయిదు లక్షల రూపాయలను చెల్లించాలని ఆయన భార్య దరఖాస్తు చేసుకొన్నారు. ఆరేళ్ల పాటు ఫైలు తిరిగింది. ఈ ఆరేళ్ల కాలంలో పెన్షన్ కూడా రాలేదు. దాంతో ఉద్యోగి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనక తప్పలేదు. 2004 డిసెంబర్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలంటూ చేసిన ఆదేశాలను అమలు చేయలేదు. మళ్లీ రెండవ సారి ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవటంతో ఆ కుటుంబానికి పరిహారం అందింది. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన ఆరేళ్లకు, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగిన తర్వాత, ఆ కుటుంబానికి సాయం అందింది. అదీ ముఖ్యమంత్రి కార్యాలయం రెండు సార్లు జోక్యం చేసుకొన్నాక!
ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికే, ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఏ చదువూ లేని ఒక సామాన్యుడు, సన్నకారు రైతు, కూలి, ఒక చిన్న వ్యాపారికి... ప్రభుత్వ కార్యాలయాలతో పని పడితే... ఆ పని ఎంత కాలానికి పూర్తవుతుంది? అందుకు ఎంత ఖర్చవుతుంది? ఎన్ని ఇబ్బందులెదురవుతాయి? ఏ పని ఎప్పటికి పూర్తవుతుందో చెప్పటం ఎవరికి సాధ్యం? ఈ ప్రశ్నలన్నిటికీ పరిష్కారాన్ని సూచించేదే 'సిటిజన్ ఛార్టర్'.

సిటిజన్ ఛార్టర్ కార్యక్రమం ప్రజాస్వామ్య సంస్కరణల్లో ఒక భాగం. వినియోగదారుడిని కేంద్రంగా చేసుకొని ప్రజానుకూల విధానాలతో ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య భాగస్వామ్యాన్ని పెంచే ప్రక్రియ ఇది. ఇది ఒక భావన లేదా ఊహ కాదు. ఇది ఒక క్రియాశీలక కార్యక్రమం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన యజమానులైన పౌరులకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలను అందించేందుకు ఇది ఉత్తమమైన మార్గం.
'ఉత్తమమైన పాలన' లేదా 'సుపరిపాలన'ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశిస్తున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, అందుబాటు లేదా పౌరులతో సాన్నిహిత్యం - ఈ మూడూ సుపరిపాలనకు సంబంధించిన ముఖ్యాంశాలు. మేలైన ప్రజా సేవలను అందించాలంటూ దేశ ప్రజలు స్వాధికారంతో అడగటంతో మన దేశంలో సిటిజన్స్ ఛార్టర్ కార్యక్రమం ప్రారంభమైంది.
1991లో యునైటెడ్ కింగ్డమ్లో అప్పటి ప్రధాని జాన్ మేయర్ సిటిజన్స్ ఛార్టర్ కార్యక్రమాన్ని పది సంవత్సరాల జాతీయ కార్యక్రమంగా ప్రకటించారు. 1996లో సమీక్షానంతరం కార్యక్రమం పేరును 'సేవ ప్రధమం (సర్వీస్ ఫస్ట్)గా మార్చారు. ప్రపంచవ్యాప్తంగా సిటిజన్ ఛార్టర్లు చెప్పుకోదగిన రీతిలో ఆసక్తిని రేకెత్తించాయి. ఆస్ట్రేలియా, కెనడా, సంయుక్త రాష్ట్రాలు, బెల్జియం, సింగపూర్ల లోను యునైటెడ్ కింగ్డమ్ తరహాలోనే సిటిజన్ ఛార్టర్ కార్యక్రమాలను చేపట్టారు.
మన దేశం విషయానికి వస్తే 'వినియోగదారుల సమన్వయ సమితి' తొలిసారిగా సిటిజన్ ఛార్టర్ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించింది. 1994లో జరిగిన కేంద్ర వినియోగదారుల రక్షణ సమితి సమావేశంలో వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజోపయోగ సేవా సంస్థల సేవలను మెరుగు పరిచే విధానం గురించి ప్రశ్నించినపుడు కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఎ.కె.ఆంటోని ప్రతిస్పందిస్తూ తొలుత ఆరోగ్య సేవలతో సిటిజన్ ఛార్టర్ను రూపొందించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అదే సమావేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆగస్ట్ 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజా సేవలను మెరుగు పరిచేందుకు సిటిజన్ ఛార్టర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. 20 నవంబర్ 1996న ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శుల సమావేశం ప్రధాని ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిటిజన్ ఛార్టర్లకు సంబంధించి కొన్ని సిఫార్సులను చేసింది. అన్ని స్థాయిల్లో పరిపాలన వ్యవస్థ సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, స్వచ్ఛంగా, ఏ అరమరికలు లేకుండా ప్రజావాక్యానికి ప్రతిస్పందించే విధంగా ఉంటుందని ప్రజలకు స్పష్టం చేయవలసిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. మరింత ఆలస్యం కాకముందే ప్రస్తుత స్థితిగతులను సంస్కరించాలని కార్యదర్శుల సమావేశం స్పష్టం చేసింది. పక్షపాతం, ఆలస్యం, లంచగొండితనం, నిర్దయ, ఉదాసీనత - ఇలా ప్రజా సేవలనగానే ప్రజలలో తలెత్తే వ్యతిరేక భావనలను మార్చవలసిన అవసరాన్ని సమావేశం గుర్తించింది. ప్రజా పాలనా వ్యవస్థ సమర్థత, యుక్తియుక్తాలను గురించి ప్రజల్లో, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించవలసి ఉంది. పారదర్శకమైన, బాధ్యతాయుతమైన ప్రజా సేవలు, వాటి ప్రక్షాళన ఒకదానితో ఒకటి ముడిపడివున్న అంశాలు. వీటినన్నిటినీ దృష్టిలో ఉంచుకొన్నపుడే స్వచ్ఛంగా ప్రతిస్పందించే పరిపాలన సాధ్యమౌతుంది.
ప్రభుత్వ, ప్రజా సంస్థల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంపొందించటంతో పాటు, కార్యకలాపాలకు సంబంధించి ఏ రహస్యమూ లేని బహిరంగ ధోరణిని అవలంబించ వలసిన అవసరం ఉంది. సేవలను పొందే ప్రజల సంతృప్తి మేరకు విస్తృతమైన పరిధిలో బాధ్యతాయుతమైన సేవలకు వివరణ ఇవ్వాలి. వీలైనన్ని ఎక్కువ సేవా సంస్థల్లో సిటిజన్ ఛార్టర్లను ప్రవేశపెట్టటంతో పాటు వాటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి.

సిటిజన్ ఛార్టర్ లోని ప్రధానాంశాలు:
  • ప్రతి ఒక్క ప్రజా సేవలోను ఉత్తమమైన నాణ్యత
  • 'ఎంపిక'లో ప్రజలకు మరింత అవకాశం
  • ఏ తరహా సేవను ఆశించవచ్చో ప్రజలకు తెలియజెప్పటం
  • సేవాలోపం ఉన్నపుడు ఏం చేయాలో ప్రజలకు తెలిసేలా చూడటం

సిటిజన్ ఛార్టర్ లోని ఆరు ప్రధానమైన సూత్రాలు:
  1. ప్రచురితమైన ప్రమాణాలు
  2. సమాచారము, బహిరంగ ధోరణి
  3. ఎంపిక, సంప్రదింపులు
  4. మర్యాదాపూర్వకమైన, సహాయం అందించే ధోరణి
  5. సేవా లోపాలకు సంబంధించి నివృత్తి
  6. డబ్బుకు తగిన విలువ

సిటిజన్ ఛార్టర్ లోని ఆరు ప్రధానమైన సూత్రాల గురించి ఇపుడు విపులంగా పరిశీలిద్దాం.
ప్రమాణాలు : స్పష్టమైన ప్రమాణాలను పేర్కొనటంతో పాటు వాటిని ప్రచురించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో ఈ ప్రమాణాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. పని పూర్తయ్యేందుకు అవసరమయ్యే కనిష్ట, గరిష్ట కాల పరిమితిని ప్రమాణాల్లో పేర్కొనాలి.
సమాచారము, బహిరంగ ధోరణి: ప్రజా సేవల నిర్వహణ, అందుకు అయ్యే ఖర్చు, సంబంధిత అధికారి ఎవరు? వంటి వివరాలతో కూడిన సంపూర్ణమైన, వాస్తవిక సమాచారం సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా చూడాలి.
ఎంపిక, సంప్రదింపులు : సేవలను వినియోగించుకొనే వారితో క్రమానుగుణ సంప్రదింపులు జరిపే అవకాశం కల్పించాలి. సేవలకు సంబంధించి వినియోగదారుల ప్రాధాన్యతలు, సేవల మెరుగుకు చేపట్టవలసిన చర్యల విషయమై వినియోగదారులు వ్యక్తం చేసే అభిప్రాయాలను తెలుసుకోవాలి.
మర్యాదాపూర్వకమైన, సహాయం అందించే ధోరణి : ప్రభుత్వ సిబ్బంది మర్యాదాపూర్వకంగా సేవలను అందించాలి. వారిని గుర్తించేందుకు అనువుగా సిబ్బంది తమ పేరును, హోదాను సూచించే బ్యాడ్జీలను ధరించాలి.
సేవా లోపాలకు సంబంధించి నివృత్తి : ఏదైనా సేవను అందించటంలో పొరపాటు జరిగినపుడు క్షమాపణ తెలియజేయాలి. సేవాలోపం ఎందుకు జరిగిందో తెలిపే కారణాలతో పూర్తి వివరణను ఇవ్వాలి. సమర్థవంతమైన నివృత్తిని సూచించాలి.
డబ్బుకు తగిన విలువ: ప్రజలు తాము చెల్లించే డబ్బుకు తగిన విలువైన సేవలను పొందటం సాధ్యం కావాలి. పన్నుల రాబడి నుంచి పరిపాలన నిమిత్తం వ్యయం చేసే మొత్తాన్ని, పౌరులకు అందే సేవల విలువలను పోల్చి చూసినపుడు డబ్బుకు తగిన విలువ లభించాలి.
ఛార్టర్ మార్క్ : యునైటెడ్ కింగ్డమ్లో విశిష్టమైన, వినూత్నమైన రీతిలో ప్రజా సేవలను అందించే వారిని 'ఛార్టర్ మార్క్ అవార్డు స్కీమ్' గుర్తించి సత్కరిస్తుంది. విశిష్టమైన సేవలు ఏవో సూచించటం ద్వారా ప్రజలు కూడా ఛార్టర్ మార్క్ స్కీమ్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు.

సిటిజన్ ఛార్టర్ల ద్వారా ఏమి సాధించవచ్చు?
  • మానవ వనరుల నిర్వహణలో అభివృద్ధి
  • సిబ్బందిలో కార్యదక్షత పెంపు
  • ప్రజలకు అధికారం
  • జవాబుదారీతనం పెరగటం
  • డబ్బుకు తగిన విలువ
  • తక్కువ సమయంలో పనులు పూర్తి కావటం
  • సిటిజన్ ఛార్టర్ విజయానికి దారి తీసే కారణాలు:
  • సిబ్బంది అందరిలో సిటిజన్ ఛార్టర్ అత్యవసరమనే భావన
  • ఛార్టర్ సూత్రాల పట్ల నిబద్ధత
  • ఛార్టర్ అమలులో ప్రగతిని పర్యవేక్షించటం
  • వ్యక్తిగత పౌరులు, వినియోగదారుల సంఘాలు, ప్రజా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు
  • సంస్కరణ చర్యలను చేపట్టటం
  • పరిపాలన వికేంద్రీకరణ
  • నియమాలు, విధానాల సరళీకరణ
  • ఫిర్యాదు పరిష్కార వ్యవస్థల అభివృద్ధి

ఫిర్యాదుకు నిర్వచనం ఏమిటి?
ప్రతిస్పందనను కోరుతూ వ్యక్తం చేసే ఏ అసంతృప్తికరమైన భావననైనా ఫిర్యాదు అనవచ్చు. ఫిర్యాదులను, ఫిర్యాదు చేసేవారిని ప్రతికూల ధోరణితో చూడటం ఏ కార్యాలయంలో నైనా మనం సాధారణంగా చూసేదే. వాస్తవానికి ఫిర్యాదులు సేవను మెరుగు పరుచుకొనేందుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయి. తమ సేవలను ఏ విధంగా మెరుగు పరుచుకోవచ్చో తెలిపే సదవకాశాలుగా పిర్యాదులను చూసేట్లు సిటిజన్ ఛార్టర్ ప్రజా సేవా సంస్థలను ప్రోత్సహిస్తుంది. ప్రతి సేవా సంస్థ తమ దైన బాణీలో ఫిర్యాదును నిర్వచించటంతో పాటు , దానిని తామందించే అన్ని సేవలకూ వర్తింపజేయాలి. విధానాల రూపకల్పన చేసినంత మాత్రాన ఫిర్యాదుల వ్యవస్థ సమర్థవంతంగా ఉంటుందని భావించటానికి వీలు లేదు. ఫిర్యాదుల పట్ల సిబ్బంది వైఖరి ముందు మారాలి.
వ్యక్తులను విమర్శిస్తూ ఫిర్యాదులను చేసే నిందాపూర్వక సంస్కృతి వల్ల సిబ్బందిలో ఫిర్యాదులంటే ఒక భయం కలుగుతుంది. దాంతో వారు ఫిర్యాదులను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఫిర్యాదులు చేసేందుకు ఎవరైనా వచ్చినపుడు కోపం, వ్యతిరేక భావనలను ప్రదర్శిస్తూ ప్రతికూల వైఖరితో వ్యవహరిస్తారు. కనుక సేవలు లేదా వ్యవస్థ లోని లోపాలను గుర్తించే సదవకాశాన్ని కల్పించేవిగా ఫిర్యాదులను చూసే వాతావరణాన్ని ప్రతి సంస్థా కల్పించాలి. ఫిర్యాదుల పరిష్కరణా విధానాలు తమకూ అనుకూలమైనవేననే భావనను సిబ్బందిలో కలిగించాలి. ప్రజల దృష్టి కోణం నుంచి సమస్యను చూసి అర్థం చేసుకొనే తత్వాన్ని సిబ్బందికి అలవాటు చేయాలి. ఫిర్యాదుల పరిష్కరణ విధానాలను క్రమశిక్షణా చర్యల నుంచి వేరు చేయాలి.

సమర్థవంతమైన ఫిర్యాదుల వ్యవస్థ ప్రాధమిక సూత్రాలు:
  • ఫిర్యాదుల వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలి. పిర్యాదుల వ్యవస్థ గురించి అందరికీ తెలిసేలా తగిన ప్రచారం చేయాలి.
  • ఫిర్యాదుల వ్యవస్థ అర్థం చేసుకొనేందుకు, ఉపయోగించేందుకు సులువుగా ఉండాలి.
  • నిర్థారిత కాల పరిమితితో త్వరితంగా సమస్యా పరిష్కారం జరగాలి. ఫిర్యాదు ప్రగతి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందాలి.
  • నిష్పక్షపాత ధోరణిలో, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి.
  • అవసరమైనపుడు ఫిర్యాదీల వివరాలను రహస్యంగా ఉంచాలి.
  • ఉన్నతాధికారులకు తగిన రీతిలో సమాచారాన్ని అందజేయటం ద్వారా సేవల అభివృద్ధికి పాటు పడాలి.
  • ఆదర్శవంతమైన ఫిర్యాదుల వ్యవస్థ 'ఎలా ఫిర్యాదు చేయాలో' ప్రజలకు తెలిసేలా చేయటమే కాక ఫిర్యాదు చేయటం వలన ఫలితం కూడా ఉంటుందని తెలుసుకొనేలా చేస్తుంది.

ఫిర్యాదుల పరిష్కరణ :
ఫిర్యాదులను స్వీకరించినట్లు అక్నాలెడ్జ్మెంట్ను ప్రతి శాఖ ఇవ్వాలి. ఫిర్యాదుల పరిష్కరణకు ఎంతకాలం పడుతుందో ముందుగా ఫిర్యాదీకి తెలియజేయాలి. పేర్కొన్న కాల పరిమితిలోగా సమస్యను పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ ఫిర్యాదీకి సమాచారం అందించాలి. ఫిర్యాదు చేయటం ద్వారా ఏమి ఆశించవచ్చు? సమస్య ఏ మేరకు పరిష్కారం అవుతుంది? అనే వివరాలను ముందుగానే ఫిర్యాదీకి తెలియజెప్పాలి.
తాము చేసే ఫిర్యాదులను సేవా సంస్థ సిబ్బంది సావధానంగా విని పరిష్కరిస్తారనే నమ్మకం కుదిరినపుడే ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తారు. ఫిర్యాదు చేసినా ఏ ఫలితమూ ఉండదని భావించినపుడు ఎవరూ ఫిర్యాదు చేయరు. కనుక ప్రతి సేవా సంస్థా ఫిర్యాదులకు సదా స్వాగతం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని, అవసరమైనప్పుడు నివృత్తి అందుతుందని, ఫిర్యాదుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సేవల నాణ్యత మెరుగుకు కృషి జరుగుతుందని ప్రజల్లో నమ్మకం కలిగించాలి.
ప్రభుత్వ శాఖ తమను ఒంటరి వాళ్లను చేసి వేధిస్తుందని, ఫిర్యాదు చేసినందుకు శిక్షిస్తుందనే భయం ప్రజల్లో కలిగితే ఫిర్యాదుల దాఖలుకు ఎవరూ ముందుకు రారు. వినియోగదారుడికీ, సేవా సంస్థకూ మధ్య సంబంధం సున్నితమైనది గానూ, దుర్బలమైనది గానూ ఉన్నపుడు ఇది మరీ కష్టం.

ప్రభుత్వ సిబ్బంది - చిన్న గుమస్తా కావచ్చు, లేదా పెద్ద అధికారి కావచ్చు. వీళ్లు అందరూ ప్రజలకు సేవకులు - ఎవరూ యజమానులు కాదు. దే ఆర్ నాట్ మాస్టర్స్ దే ఆర్ సర్వెంట్స్

Labels:

20071128

త్వరలో జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ

పొగాకు నిరోధక చట్టాన్ని అమలుచేసేందుకు 'జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ'ను ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్‌ లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల పరిసరాల్లో పొగతాగడంపై నిషేధం, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చూడటం వంటి అంశాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయన్నారు. బీడీ, సిగరెట్‌ పెట్టెలపై చట్టబద్ధమైన హెచ్చరికల ముద్రణ, వాటిల్లో తార్‌, నికోటిన్‌ ఏస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారో లేదో కూడా పరిశీలిస్తుందన్నారు.

Labels: ,

20071126

2008 డిసెంబర్ నాటికి 22 జిల్లాల్లో ' ఆరోగ్యశ్రీ'

2008 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 22 జిల్లాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఖమ్మం జిల్లా వైరాలో విలేకరుల సమావేశంలో  వెల్లడించారు.  పేదలకు నాణ్యమైన కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆసియాలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు.

Labels: ,

విమానం రద్దుకు పరిహారం చెల్లించాలి

నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా రైళ్ళు, బస్సులు, విమానాలు బయ లుదేరడం, ముందస్తు సమాచారం లేకుండానే హఠాత్తుగా రద్దవడం, ఇవన్నీ తరచుగా ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలే. ఎప్పుడు బయలు దేరుతుందో తెలియక, అసలు సర్వీసు ఉందో, రద్ద యిందో సమాచారంలేక గంటల తరబడి ఎదురుచూస్తూ ప్రయాణికులకు  కలిగే చికాకు, ఆందోళన, ఆవేదన అంతా ఇంతా కాదు. ఇలా బాధ్యతా రా హిత్యంగా ప్రవర్తిస్తున్న రవాణా సంస్థలపై వినియోగదారుల కోర్టులలో ఎన్నోసార్లు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు కూడా ఇటువంటిదే. సాంకేతిక కారణాల రీత్యా విమానాలను రద్దుచేసిన విమానయాన సంస్థలు ప్రయాణికులందరికీ 15,000 రూపాలయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. యోగేష్ కుమార్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్ ఈ ఆదేశాలు జారీచేసింది.

Labels:

స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రారంభం

ఢిల్లీ ప్రభుత్వం స్మార్ట్ కార్డు ప్రాజెక్టును ప్రారంభించింది. 16 కేబి స్మార్టు కార్డు ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్‌లు ఢిల్లీ  లోని ఒక జోనల్ కార్యాలయం నుండి జారీ అవుతున్నాయి. దశలవారీగా ప్రాజెక్టు తక్కిన జోన్లలో కూడా అమలవుతుంది. స్మార్టు కార్డుకు  నకిలీ కార్డును సృష్టించడానికి వీలు కాదు. ఎలక్ట్రానిక్ చిప్ కార్డు డ్రైవరు చేసిన తప్పులను, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ సమాచారాన్ని, కార్డు కలిగి ఉన్న వ్యక్తి జీవిత భీమా వివరాలను భద్రపరుస్తుంది. ఢిల్లీలో ఏటా 3.5 లక్షల లైసెన్స్‌లు జారీ అవుతున్నాయి.

Labels:

20071125

పౌర హక్కులపై విద్యార్థులకు పోటీలు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా పౌర హక్కులపై విద్యార్థులకు పోటీలు నిర్వహించింది. వ్యవసాయ ఉత్పత్తులపై ఆగ్ మార్క్ నాణ్యతా చిహ్నాన్ని ఈ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ సంస్థ ఇచ్చే విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గాలి ఉదయ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఉదయ కుమార్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ అధికారి మోహన్ నాయుడు స్వాగతోపన్యాసం చేశారు.

Labels:

వినియోగదారుల సంఘాలకు శిక్షణ

ఆంధ్ర ప్రదేశ్ వినియోగదారుల సంఘాల సమాఖ్య ఇటీవల వినియోగదారుల సంఘాల నిర్వాహకుల కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి కాసు వెంకట క్ర్రిష్ణారెడ్ది, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గాలి ఉదయ కుమార్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంచాలకుడు శర్మ, కాప్కో గౌరీశంకర్, నాగేశ్వ్రర రావ్ తదితరులు పాల్గొన్నారు.

Labels: ,

20071124

తప్పుడు సమాచారంతో పొందిన బీమా క్లెయిమ్స్

మోసంతో కాని, తప్పుడు సమాచారంతో కాని పొందిన బీమా పోలసీ క్లెయిమును చెల్లించకుండా బీమా కంపెనీ తిరస్కరించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తప్పుడు సమాచార విషయం రుజువైన పక్షంలో అసలు పోలసీనే రద్దుచేయవచ్చునని జస్టిస్ ఎస్బీ సిన్హా, జస్టిస్ హెచ్ఎస్ బేడీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేరళకు చెందిన చాకోచాన్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన కుటుంబీకులు ఎల్ఐసీ పాలసి క్లెయిము చేశారు. పాలసీ తీసుకున్న ఆరునెలలకే ఆయన మరణించారు. తనకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగిందన్న విషయాన్ని పాలసీ తీసుకున్న సమయంలో ఆ ఇంటియజమాని దాచి పెట్టారని, దరఖాస్తులో దానికి సంబంధించిన చోట 'నో' అని పేర్కొని తప్పుదోవ పట్టించారని క్లెయిమును ఎల్ఐసీ తిరస్కరించడంతో వివాదమైంది. కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పాలసీదారు కుటుంబానికి అనుకూలంగా, అప్పీలులో బహుళసభ్య ధర్మాసనం ఎల్ఐసీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఇప్పుడు సుప్రీం.. హైకోర్టు డివిజన్‌బెంచి తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వు జారీచేసింది.

Labels: ,

ఎయిడ్స్ నిరోధక వ్యాక్సిన్ ప్రయోగం విఫలం

దేశీయంగా తయారుచేస్తున్న ఎయిడ్స్ నిరోధక వ్యాక్సిన్(టీకా) తొలి దశ ప్రయోగాలు విఫలమయ్యాయి. దేశంలోనే ప్రప్రథమంగా రెండేళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించిన పుణేలోని నేషనల్ ఎయిడ్స్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎఆర్ఐ) శాస్త్రవేత్తలు రూపొందించిన ఎయిడ్స్ వ్యాక్సిన్‌ పరీక్షల్లో విఫలమైంది. మొదటిదశ పరీక్షల్లో భాగంగా 2005లో 30 మందిపై అడెనో అసోసియేటెడ్ వైరస్ వెక్టర్ వ్యాక్సిన్ ప్రయోగించి చూశారు. కానీ వారిలో 80 శాతం మందిలో వ్యాక్సిన్ ప్రభావం చూపించలేకపోయింది. వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో వెంటనే రోగనిరోధక శక్తి ఆశించినంతగా పెరగలేదు.. అందువల్ల ఈ వ్యాక్సిన్ రెండోదశ ప్రయోగాలకు వెళ్లదలుచుకోవడం లేదని ఎన్ఎఆర్ఐ డైరెక్టర్ రమేష్ పరంజపే తెలిపారు. వ్యాక్సిన్‌ను మూడుదశల్లో ప్రయోగించాలని శాస్త్రవేత్తలు మొదటగా భావించారు. మొదటిదశలో 30మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి, పనితీరును అధ్యయనం చేశారు. మొదటిదశ ఫలితాలు సంతృప్తికరంగా వస్తే , రెండోదశలో 500 మందిపై మూడోదశలో వేలాదిమందిపై పరీక్షించి చూడాలని భావించారు. ఇదీ విజయవంతం అయితే వేలాది మందిపై ప్రయోగించి టీకా ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ తొలి దశలోనే టీకా అంతగా ప్రభావం చూపలేదు.

Labels: , ,

ప్రపంచంలో 3.7 కోట్ల మంది అంధులు

ప్రపంచంలో మొత్తం 3.7 కోట్ల మంది అంధులున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వారిలో 67 లక్షల మంది ఒక్క భారత్‌లోనే ఉన్నారని, అంటే ప్రతి ఐదుగురు అంధుల్లో ఒకరు భారతీయులని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2001-02లో దేశంలో అంధుల సంఖ్య మొత్తం జనాభాలో 1.1 శాతం ఉండగా 2006-07 నాటికి 1 శాతానికి తగ్గింది. 2020 నాటికి 0.3 శాతానికి అంధుల సంఖ్యను తగ్గించాలని జాతీయ అంధత్వ నివారణ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లోని నేత్ర నిధి కేంద్రాల జాతీయ సంఘం లెక్కల ప్రకారం మన దేశంలో 500 నేత్ర నిధి, నేత్రదాన కేంద్రాలు ప్రతి ఏటా 30వేల కళ్లను సేకరిస్తున్నాయి.

Labels:

20071123

వికలాంగులకు రుణాలపై రాయితీ పెంపు

వికలాంగ విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో సమానంగా ఉపకారవేతనాలు, ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23వ తేదీన మహిళా, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, ఏపీ డైరీలపై ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమీక్ష జరిపిన అనంతరం మంత్రి రాజ్యలక్ష్మి వికలాంగులు పొందే రుణాలపై రాయితీని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్‌ల ద్వారా ఇచ్చే రుణాలపై రూ.10వేల వరకూ రాయితీ ఇస్తుండగా... వికలాంగుల కార్పోరేషన్ అందించే రుణాలపై రూ.3వేలు మాత్రమే రాయితీ కల్పిస్తున్నారు.

Labels: ,

20071121

భారతదేశంలో తగ్గుతున్న ఎయిడ్స్

భారతదేశంలో హెచ్ఐవీ/ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గింది.  దేశంలో ఎయిడ్స్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా లెక్కల్లో తేలింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎయిడ్స్ నియం త్రణ విధానం ఫలితాలనిస్తోందని, ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగ భారతదేశ సమన్వయ కర్త డెనిస్ బ్రౌన్ చెప్పారు. సమితి అంచనా ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 25లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. తమిళనాడు, మహారాష్ట్రలో ఎయిడ్స్ కేసులు తగ్గగా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెరిగాయి.  అంచనా వేసిన దానికన్నా ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ కేసు లు ఏడు మిలియన్లు తగ్గాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఎయిడ్స్ రోగుల సంఖ్య 39.5 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపారు.

Labels: , ,

శంకర ఐ ఫౌండేషన్‌కు విరాళం

కాలిఫోర్నియా: శంకర నేత్రాలయ ఫౌండేషన్‌కు నిధుల సేకరణార్థం ఇండియన్ క్లబ్ శాన్ మాటోలోని హైస్కూల్‌లో  'ఇండియన్ కలర్స్' పేరుతో సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన  11,037 డాలర్ల మొత్తాన్ని ఇండియన్ క్లబ్ అధ్యక్షురాలు సింధూరి గొల్లమూడి  శంకర నేత్రాలయ ఫౌండేషన్ చైర్మన్ మురళీ కృష్ణమూర్తి కి అందజేశారు.

Labels:

యువకళాకారులకు ఉపకార వేతనాలు

యువ కళాకారులు 2008-09 సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంస్కృతిక వ్యవహారాలశాఖ అధికారులు ఒక ప్రకటనలో కోరారు. 10-14 సం|| మధ్య వయస్సు ఉండి శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, నృత్యం, నృత్యరూపకం, నాటకం, జానపద కళల్లో అభిరుచి ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలు పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 20వ తేదీలోగా దరఖాస్తులను సంచాలకులు, సాంస్కృతిక శాఖ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్ అనే చిరునామాకు పంపించాలి. పూర్తి వివరాలను www.ccrtindia.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

Labels: ,

20071115

చిట్‌ఫండ్ సవరణ బిల్లు ఆమోదం

1971 నాటి చిట్‌ఫండ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.  చిట్‌ఫండ్ కేసులను సివిల్ కోర్టుల పరిధి నుంచి తీసివేసి రిజిస్ట్రార్‌లకు బదలాయించడం ఈ సవరణ లలో ఒకటి. చిన్నమొత్తాల్లో చిట్‌లు కట్టేవారిని రక్షించడం కోసమే చట్టంలో సవరణలు తెస్తున్నామని మంత్రి రత్నాకరరావు అన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని  నిబంధనలను తీసుకునే సవరణలు చేశామని, తాము కొత్తగా ఏమీచేయలేదని చెప్పారు. దీని ప్రకారం ఇక నుంచి లక్ష రూపాయల చిట్‌కు 50 శాతం డ్రాఫ్టు రూపంలో, మిగిలిన 50 శాతం బ్యాంకు నుంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  కోర్టుల్లో మూడు వేల చిట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు అధికారులను నియమిస్తున్నామని, శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు.

Labels: ,

20071107

పత్రికా చట్టంలో మార్పులు రానున్నాయా?

ఇపుడు అమలులో వున్న ప్రెస్, పుస్తకాల రిజిస్ట్రేషన్ (పిఆర్‌బి) యాక్ట్ 140 సంవత్సరాల కిందటిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో  వెలువడుతున్న ఆన్‌లైన్ న్యూస్ పోర్ట ల్‌లు, పత్రికల వెబ్ ఎడిషన్లను కూడా పత్రికా  చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వంయోచిస్తున్నది. వీటితోపాటు ప్రత్యేకంగా వార్తల ప్రసా రానికే ఏర్పాటు చేసిన టీవీ చానల్‌లు  కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టంలోని ముద్రణ, వార్తాపత్రిక వంటి సంబంధిత పదాలను సవ రించాలనీ, పునర్ నిర్వచించాలని ప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ఇదే జరిగితే బ్లాగర్లు కూడా ఇక ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా లైసెన్సు తీసుకోవాల్సి వస్తుందేమో..

Labels: ,

20071106

వి.ఎస్.ఎస్.లతో గిరిజన కుటుంబాలకు లబ్ధి

విశాఖపట్నం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల గిరిపుత్రుల జీవన పరిస్థితులు మెరుగవుతున్నాయని రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఆర్.ఎ.పి) డి.కె.ఝా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో మొత్తం 5డివిజన్లలో 'వన సంరక్షణ సమితి సభ్యుల పునరావాస పథకం' అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటైన స్వతంత్ర సభ్యుల పర్యవేక్షక సంఘం సమీక్ష ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఝా మాట్లాడుతూ 5 అటవీ డివిజన్లలో చాలా మంది ఆదివాసీలు, గిరిజనులు పోడు వ్యవసాయం మాని, వన సంరక్షణ సంఘాలుగా ఏర్పడ్డారని, వాళ్లందరికీ ప్రభుత్వం పునరావాసం కల్పించేందుకు సాయం చేస్తోందని వివరించారు. పోడు భూమిని అప్పగించిన ప్రజలకు నష్ట పరిహారం ఇచ్చేలా 2000 నుంచి జె.ఎఫ్.ఎం. రెండో దశ (రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్- ఆర్.ఎ.పి) అమలు చేస్తున్నారు. మొత్తం రూ. 28 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పథకంలో ఇప్పటికి రూ. 7 కోట్లు ఖర్చు చేసి, 434 గ్రామాల్లోని 11,600 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు ఝా తెలిపారు. ఈ ఆర్.ఎ.పి. అమలు తీరును పర్యవేక్షించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులు సభ్యులుగా ఒక 'స్వతంత్ర సలహా బృందం'(ఇండిపెండెంట్ అడ్వైజరీ గ్రూప్- ఐ.ఎ.జి)ను ప్రభుత్వం నియమించింది.

Labels: , ,

చట్టపరిధిలోకి మొబైల్ ఫోన్ టవర్లు

మొబైల్ ఫోన్ టవర్లు హానికరమైన ఎలక్ట్రోమేగ్నటిక్ రేడియేషన్‌ను వెలువరిస్తుండటంతో వాటిని క్రమబద్ధీకరిస్తూ చట్టాన్ని రూపొందించమని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. సెల్యులార్ సర్వీసు ప్రొవైడర్లకు చెందిన 3,000 టవర్లు నగరంలో ఉన్నాయి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు టవర్ల స్థాపన జరుగుతూనే ఉంది. టవర్ల నుండి వెలువడే రేడియేషన్ స్థాయి డేటాపై ఖచ్చితమైన ప్రమాణాలు ఇప్పటి వరకు లేవు. దీనికి సంబంధించి ఎటువంటి చట్టం లేకపోవడంతో ప్రభుత్వం ఏ రకమైన చర్యా తీసుకోలేక పోతోంది.

Labels: , , ,